Sunday, October 26, 2008

'తాటి' పద్యాలు

నిన్న దీపావళి టపాకాయలు కొందామని ఒక చైనీస్ కొట్టుకు వెడితే అక్కడ canned తాటిముంజలు కనపడ్డాయి. తెచ్చి వాటిని తింటూంటే పాత రోజులు గుర్తుకు వచ్చాయి.

ఏప్రిల్లో బడి అయిపోయినతరువాత కాలవగట్టమ్మట సైకిలు తొక్కుకుంటూ ఇంటికి వెళుతుంటే అప్పుడప్పుడూ తాటిముంజలమ్మేవాడు దేవుడిలా ఎదురొచ్చేవాడు.

ఉ//
వేసవి కాలమందలసి వేడిభరించుట చాల కష్టమై
మూసిన కళ్ళతో యతని మోము తలంచుచు మ్రొక్కి వేడగా
దాసుడి రక్షకై యతడు తారసమాయెను భూమిపై వడిన్
వాసివి తాటిముంజలను పైకము కమ్మెడివాని రూపునన్

(సైకిలు త్రొక్కుతున్నప్పుడు కూడా ప్రాసకోసం కళ్ళు మూసుకోవలసి వచ్చింది :-)

పల్లెటూళ్ళలో పెరిగిన పిల్లలందరికీ వేసవిలో తాటికాయలతో తోపుడు బళ్ళు చేసుకుని ఆడుకోవడం ఆనవాయితి.

ఉ//
తిన్నని తాటిమట్టగని తెప్పున కన్నము చేసి అందు నో
సన్నని కర్రపుల్లొదవి చక్కని గుండ్రని తాటికాయలన్
ఎన్నిక చేసి వాటముగ నీదరి నాదరి గ్రుచ్చి నంత నో
మిన్నగు తోపుబండగును మేలుగ పిల్లలు ఆటలాడగా

కం//
లెక్కకు మూడవి ఉన్నను
ముక్కంటికి కన్ను ఒకటి మూసుకునుండున్
నిక్కముగా ముక్కంటది
చక్కనిదొక తాటికాయ సరసుడ వినుమా!

7 comments:

పుల్లాయన said...

మీ పద్యాలు చాలా బాగున్నాయండీ అందరికీ అర్థం అయ్యే రీతి లో. ధన్యవాదాలు.

కొత్త పాళీ said...

హ హ హ.
సెబాసు.
ముక్కంటి కంద పద్యం మరీ బాగు.
బ్లాగ్లోకంలో మరో ఛందో కవి ఉదయం. స్వాగతం.

రానారె said...

అద్భుతం. పద్యాలు చదువుతూ వుంటే మీరు చెప్పిన సన్నివేశం కళ్లముందు కదిలింది.

Anonymous said...

చాలా బాగున్నాయి పద్యాలు. నిక్కమగు ముక్కంటి... పోలిక బాగుంది.

చంద్ర మోహన్ said...

తాటి చెట్ల కింద మూసిన కళ్ళతో పైకము కమ్మెడి వానిని తలచుకొంటే, 'మైకము కమ్మెడి' అవకాశం ఎంతైనా ఉంది :-)

Bolloju Baba said...

చాలా బాగున్నాయి.
నిజమైన ముక్కంటి ముంజే నంటారు. అందమైన భావన

Anonymous said...

బాగున్నాయి మీ పద్యాలు లేలేత తాటి ముంజల్లా