Monday, October 20, 2008

నేనెందుకు బ్లాగుతాను

అనుకోకుండా క్రొద్దిరోజుల క్రితం నా పాత మిత్రుడి బ్లాగుకి వెళ్ళి దాని ద్వారా మిగిలిన కొన్ని తెలుగు బ్లాగులను చూచిన తరువాత, బ్లాగ్ప్రపంచంలో నేను చాలా వెనబడి ఉన్నానని అనిపించింది. అడపాదడపా నేను వ్రాసిన పద్యాలతో నా బంధుమిత్రులు కొందరిని బాధపెడుతూ ఉంటాను. ఈ బ్లాగు పేరుతో ఇంకొంతమంది తెలియని వాళ్ళని కూడా నా అభిప్రాయాలకు/పద్యాలకు బలి చెయ్యొచ్చని తెలిసి మొదలు పెట్టాను. ప్రోగ్రామింగు నేర్చుకుంటున్నప్పుడు మొదటి ప్రోగ్రాము "hello! World!" లాగా, చాల బ్లాగులలో 'నేనెందుకు బ్లాగుతాను' అనేది మొదటి టపాగా చూచి, సరే సాంప్రదాయభంగమెందుకని అదే అంశంగా నా మొదటి టపాని ప్రచురించడానికి ఇది నా ప్రయత్నం. Green Initiative పేరుతో అందరూ recycling చెయ్యండో అని అంటున్నారు కాబట్టి, నా పాత పద్యాన్ని ఒకదాన్ని recycle చేసి ఇక్కడ ఇస్తున్నాను.

కం//
కొద్దిగ సమయము దొరికిన
ఒద్దికగా వ్రాయనేర్తు నొకటో రెండో
పెద్దవి రచనలు కుదరవు
పెద్దన చెప్పిన సుఖములు పెక్కుగ లేకన్

చదివి ఆనందిస్తారని ఆశిస్తూ..

4 comments:

Anonymous said...

బాగుగ పద్యము లల్లెడి
బ్లాగరు లొకచోటజేరి పద్యములల్లన్
మోగెను జాలము నందున
వేగమె పొద్దున చదవగ పిలుపిదె మీకున్

Anonymous said...

అసలు విషయం రాయలేదు చూసారా..
మీ పద్యంలోని చమత్కారం బహు బాగు! పెద్దనగారడిగిన ఈ వసతుల గురించి ఊకదంపుడు గారు ఓ మంచి తాంబూలం లాంటి టపా ఒకటి గతంలో వేసారు.. చూసి ఉండకపోతే, ఓసారి చూడండి. అక్కడ చర్చ కూడా బాగా జరిగింది.

ఊకదంపుడు said...

"చిరుతరువింక పూచివికసించి ఫలమ్ములనిచ్చి కాచుగా !"
అని మొన్ననే ఆశను వ్యక్తం చేశాను, ఇప్పుడు ఇంకో పద్య బ్లాగు మొదలైందని తెలిసి సంతోషిస్తున్నాను. మీ నుంచి మరిన్ని పద్యాలను చూడాలని ఆశిస్తూ-

సంతోషముమీరాకిట
అంతో ఇంతో నుడువుడి ఆగక ఇకపై;
సుంతైనావాసుంటే
అంతే చాలు, పదివేలు, ఆర్యా! మాకున్.

ఊకదంపుడు said...

విరుపు : సుంతైనా, వాసుంటే
పెడార్ధం స్పురించకుండ ఉండటానికి 3వ పాదం కొంచం మార్చాను
సంతోషముమీరాకిట
అంతో ఇంతో నుడువుడి ఆగక ఇకపై;
సుంతైనా వాసిగలుగ
నంతే చాలు, పదివేలు, ఆర్యా! మాకున్.


మరో మాట, మీరు ఎంచుకున్నా " Word Verification" వ్యాఖ్య వ్రాయ దలుచుకున్న బ్లాగరులకు పెద్ద నచ్చకపోటం గతం లో చూశాను, అది అవసరమో కాదో ఓ మారు చూడండి
భవదీయుడు
ఊకదంపుడు