Sunday, March 29, 2009

ఆవకాయ - పద్యాలు

కాలిఫోర్నియాలోని సిలికాన్‌వేలీలో మార్చి 28న సిలికానాంధ్రా వారి శ్రీ విరోధీనామ సంవత్సర ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. దానిలో భాగంగా జరిగిన కవి సమ్మేళనములో నేను చదివిన పద్యాలు.


కం//
శ్రేష్టంబిది పచ్చళ్ళన,
టేష్టున ఇది మొదటనుండు డెఫినెట్ గానూ,
ఇష్టముగ ఆవకాయను
సుష్టుగ తిని దొర్లినంత సుఖమది కలదే!


(ఈ పై పద్యం లోని ఆఖరి రెండు పాదాలూ, కవి మిత్రులు 'ఆత్రేయ' గారి అనుమతితో వారి ఒక పద్యమునుంచి 'లేపిన'వి.)


కం//
ఊరిన ముక్కను కొరకగ,
ఔరా! అది ఎంత రుచిని అందించునయా,
కూరిమితొ నాల్గు ముక్కలు
నోరారా తినని నోరు నోరవ్వదుపో!

కం//
బెల్లము వేసిన మధురము,
పల్లీనూనెను కలపగ పచ్చడి మధురం,
వెల్లుల్లి వేయ మధురము,
పుల్లని మామిడితొ చేయ ముక్కది మధురం!!


ఈ ఆవకాయలోని ముక్కకి చాలా పేర్లు ఉన్నాయి:

కం//
చెక్కందురు, డిప్పందురు,
ముక్కందురు కొంతమంది మురిపెము తోడన్.
డొక్కందురు, మామిడి దిది
పిక్కందురు దీనికన్ని పేర్లున్నవయా!


ఆవకాయ ఉపయోగాలు:

కం//
ఉదయమె బ్రెడ్డున జాముకు
బదులుగ ఇదివాడిచూడు, బ్రహ్మాండములే,
అదియేమి మహిమొ తెలియదు,
పదునుగ నీ బుర్ర అపుడు పనిచేయునయా!


కం//
ఇందువల దందు బాగని
సందేహము వలదు; ఊట సర్వ రుచిహరం
బెందెందు కలపి చూసిన,
అందందే రుచిగనుండు, అద్భుత రీతిన్!


ఆవకాయ అవతరణ:

కం//
“చప్పటి దుంపలు తినుచును,
తిప్పలు పడుచుంటిమయ్య, దేవా, దయతో
గొప్పగు మార్గం బొక్కటి
చెప్పుము మా నాల్కలొక్క చింతలు తీర్పన్”

అంటూ,

కం//
ముక్కోటి దేవులందరు
మ్రొక్కగ తా జిహ్వలేప సృష్టించెనయా
చక్కనిది ఆవకాయన
ముక్క తినని వాడు కొండముచ్చై పుట్టున్!!


కం//
చారెరుగనివాడును, గో
దారిన తా నొక్కమారు తడవని వాడున్,
కూరిమిన ఆవకాయను
ఆరారగ తిననివాడు, ఆంధ్రుడు కాడోయ్!

Wednesday, March 11, 2009

శ్రీనాధుడి చాటువు

పని ఒత్తిడి వలన ఈ మధ్య తెలుగు బ్లాగ్లోకంలో గడపడానికి సమయం చిక్కలేదు.


కం//

ఇక్కడి జీవిత మింతే,

లెక్కకు సౌకర్యమున్న లేదులె సమయం;

ఎక్కడ, తీరిక దొరకదు.

చక్కగ ఈ బ్లాగులన్ని చదువుట కొఱకై


చాలా రోజుల తరువాత బ్లాగులు తిరగేస్తూ ఉంటే శ్రీనాధుడి చాటువొకటి కనపడింది.

వెంటనే శ్రీనాధుడి ఇంకొక చాటువు గుర్తుకొచ్చింది.

నా తప్పేంలేదంటూ, అలాంటి సమర్ధింపే ఈ చాటువులో కూడా చూడండి:


గుబ్బలగుమ్మ, లేచిగురు కొమ్మ, సువర్ణపు కీలుబొమ్మ, భల్

గిబ్బిమిఠారి చూపులది, కాపుది, దానికి ఏల ఒక్కనిన్

బెబ్బులి నంటగట్టితివి, పెద్దవునిన్ననరాదు గాని, దా

నబ్బ, పయోజగర్భ, మొగనాలికి ఇంత విలాసమేటికిన్!!


తాత్పర్యం:
ఓ బ్రహ్మా (దానబ్బ, పయోజ గర్భ), ఇంతటి అందగత్తెకు (గుబ్బల గుమ్మ, లేచిగురు కొమ్మ, సువర్ణపు కీలుబొమ్మ) ఒక బెబ్బులి లాంటి వాడినెందుకు అంటగట్టావయ్యా?? అంతే కాకుండా, ఇలాంటి వివాహితకు (మొగనాలికి) ఇంత విలాసమెందుకిచ్చావయ్యా? (కవిహృదయం ఏమిటంటే, ఆమెను వలచడంలో నా తప్పేమీ లేదు, సృష్టించిన నీదే తప్పు అని )