Sunday, September 25, 2022

మొగుడు - ఇత్తడి చెంబు

కం//

పుత్తెను గట్టిన పురుషుడు

ఇత్తడిదగు చెంబుబోలు నెట్లని చూడన్

మొత్తిన చెంబున సొట్టడు

మెత్తగ పులుసేసి తోమ మెరయును శ్యామా!


తల్లీ, మొగుడనేవాడు ఇత్తడి చెంబులాంటి వాడు. మొత్తావనుకో నీ సొత్తుకే సొట్టలు పడతాయి. అందుకని బాగా తోమాలి. ఎంత చింతపండేసి తోమితే చెంబు అంత బాగా మెరుస్తుంది.


Thursday, July 14, 2022

శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి అష్టావధానము - July 9th

 July 9th మా నగరిలో SiliconAndhra ఆధ్వర్యంలో జరిగిన శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి అవధానములో నేనిచ్చిన సమస్య:

పూటిను మంచివాడనుచు పూజలు జేసిరి యూక్రెయిన్ జనుల్

అవధాని గారి పూరణ:
ఉ//
చీటికి మాటికిచ్చటకు చేరగ మాపురి దూరమయ్య మా
బోటులు బాంబు ఖర్చులకు పోయగ నేమియు చాలరయ్య మా
పాటుల పాటలెంతకని పాడగ జెల్లునయా యటంచు శ్రీ
పూటిను మంచివాడనుచు పూజలు జేసిరి యూక్రెయిన్ జనుల్
(అవధాని గారి వివరణ: సమయం అనుకూలముగా లేనప్పుడు, అవతలివాళ్ళని శత్రువైనా మచ్చికచేసుకోవాలన్న దృష్టిలో ఊక్రెయిన్ ప్రజలు పూటిన్ కు పూజలు చేసారు)

నా పూరణ:
ఉ//
బీటలువారుతున్న తమ పేరుకు రక్షణ జేయనెంచి తా
మోటమినొప్ప నేరక నయోమయ పౌరుల కళ్ళు గప్పగన్
బూటకమైన వార్తలను ముద్రణ జేసిరి యీవిధంబుగన్:
"పూటిను గొప్పవాడనుచు పూజలు జేసిరి యూక్రెయిన్ జనుల్"
(నిరంకుశులు, ముఖ్యంగా యుద్ధసమయాలలో, తమ ప్రజల మద్దతుకై శత్రువులు ఓడిపోయారని తప్పుడు వార్తలు ప్రచురిస్తారు. ఆ విధంగా రష్యాలో ఈ తప్పుడు వార్త ప్రచురింపబడినదని నా భావం)

Friday, June 3, 2022

 సమస్య - సానులతో చెలిమి మోక్షసాధనము గదా!

కం//
ఐనిస్టైన్-బోసులు పర
మాణువునకొకటి యుపపరమాణువుచూపన్
తాననె హాకిన్స్ ఈ 'బో
సాను'లతో చెలిమి 'మోక్షసాధనము' గదా!

Satyendranath Bose and Einstein proposed a sub-atomic particle called Boson. When it was discovered in 2012, Stephen Hawkins, a famous Physicist, suggested that unstable Higgs-Boson leaves the way open for a catastrophic cosmic wipe-out. ఇక్కడ 'మోక్షసాధనము ' ఈ cosmic wipe-outను వ్యంగ్యముగా సూచిస్తూ వాడబడినది.

Sunday, May 29, 2022

కం//

ఆసులు పస పేకాటకు,

రాసులు పస ధాన్యములకు, రవికలకెల్లన్

లేసులు పస, బౌలర్లకు

పేసులు పస భువనమందు, వినరా శ్యామా!


Friday, May 27, 2022

 సమస్య: నిరుపేదగృహంబున సిరి నెలవుండుసదా!

కం//
చరవాణి చేతనుండక
జరుగునె పనులొక్కటైన జగతిన జూడన్!
తిరముగ నీ రోజులలో
నిరుపేదగృహంబున 'సిరి' నెలవుండుసదా!

(ఐఫోను లోని 'సిరి' గా భావించవలెను - పేదల దగ్గర కూడా ఐఫోన్ ఉండవలసి వస్తోంది/ఉంటున్నాయి అని పూరణ)

Thursday, May 26, 2022

 

కం//

బాసలు పస నెయ్యములకు,

ప్రాసలు పస పద్యములకు, భాషలకెల్లన్

యాసలు పస, కంఠములకు

పూసలు పస జగతిలోన, పుల్లెల శ్యామా!

Tuesday, May 24, 2022

మరఁదిని ముద్దాడెను సతి మఱిమఱి ప్రేమన్!


కం//

బొరుగుల భేల్పురిఁ బట్టుకు

సరసముగా భర్త పత్ని సరసన జేరన్

కరకర లాడెడు నొక మర

మరఁ దిని ముద్దాడెను సతి మఱిమఱి ప్రేమన్!


(మరమర = మరమరాలుకు ఏకవచనముగా వాడాను)

Thursday, May 19, 2022

 కం.

జబ్బలు పస వస్తాదుకు,

దిబ్బలు పస బయలుకెల్ల, తెఱవలకెల్లన్

గుబ్బలు పస, రుచిగాయకు

దబ్బలు పస తరచి జూడ ధరణిన శ్యామా!


(బయలు = ఎడారి, తెఱవ = స్త్రీ, రుచిగాయ = ఊరగాయ, దబ్బ = ముక్క)