Saturday, April 20, 2024

క్రోధి నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనము

ఏప్రిల్ 12 2024 రోజున జరిగిన 'వీక్షణం' సాహితీ గవాక్షం వారి క్రోధి నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనములో నేను చదివిన పద్యాలు:


సీ//

రామచంద్రుడనెడి నామంబు గల్గియూ 

              పరవనితల వెంటఁ బరుగులిడరొ?

సావిత్రి యనిబిల్వ చక్కనౌ పేరుండి 

              భర్తను బాధించు పడతి లేదొ?

శాంతి యనెడి పేరు సార్ధక నామంబె, 

              కోపమెపుడు గల్గు కోమలికిని?

వీరభద్రుడనెడి పేరుదాల్చియుగూడ 

              నెమ్మదిగ మసలువా నిలనఁ గనమొ?

తే.గీ//

పేరుఁ దెల్పదు నెవ్వాని పేర్మి గుణము

క్రోధి నామమ్ము విని మీరు క్రుంగవలదు

ఆయురారోగ్యములనిచ్చి హాయి గూర్చి

కూర్మిఁ గాపాడుఁ జక్కగా  క్రోధి మనను!

Monday, May 15, 2023

మండే యెండనఁ దిరిగిన మనిషికి మేలౌ!

 సమస్య: మండే యెండనఁ దిరిగిన మనిషికి మేలౌ!


నా పూరణ:

కం//

ఎండది మేనుకుఁ సోకిన

మెండుగ డి-విటమినిచ్చి మేలును గూర్చున్

'సండే' వరకూ వానలు

'మండే' యెండనఁ దిరిగిన మనిషికి మేలౌ!


(సండే = Sunday, మండే = Monday)


(సూర్యరశ్మి వలన శరీరమునకు చాల అవసరమైన D-విటమిను అందుతుంది. అందువలన రోజులో కొంతసేపు ఎండలో తిరగమంటారు)

 


Sunday, September 25, 2022

మొగుడు - ఇత్తడి చెంబు

కం//

పుత్తెను గట్టిన పురుషుడు

ఇత్తడిదగు చెంబుబోలు నెట్లని చూడన్

మొత్తిన చెంబున సొట్టడు

మెత్తగ పులుసేసి తోమ మెరయును శ్యామా!


తల్లీ, మొగుడనేవాడు ఇత్తడి చెంబులాంటి వాడు. మొత్తావనుకో నీ సొత్తుకే సొట్టలు పడతాయి. అందుకని బాగా తోమాలి. ఎంత చింతపండేసి తోమితే చెంబు అంత బాగా మెరుస్తుంది.


Thursday, July 14, 2022

శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి అష్టావధానము - July 9th

 July 9th మా నగరిలో SiliconAndhra ఆధ్వర్యంలో జరిగిన శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి అవధానములో నేనిచ్చిన సమస్య:

పూటిను మంచివాడనుచు పూజలు జేసిరి యూక్రెయిన్ జనుల్

అవధాని గారి పూరణ:
ఉ//
చీటికి మాటికిచ్చటకు చేరగ మాపురి దూరమయ్య మా
బోటులు బాంబు ఖర్చులకు పోయగ నేమియు చాలరయ్య మా
పాటుల పాటలెంతకని పాడగ జెల్లునయా యటంచు శ్రీ
పూటిను మంచివాడనుచు పూజలు జేసిరి యూక్రెయిన్ జనుల్
(అవధాని గారి వివరణ: సమయం అనుకూలముగా లేనప్పుడు, అవతలివాళ్ళని శత్రువైనా మచ్చికచేసుకోవాలన్న దృష్టిలో ఊక్రెయిన్ ప్రజలు పూటిన్ కు పూజలు చేసారు)

నా పూరణ:
ఉ//
బీటలువారుతున్న తమ పేరుకు రక్షణ జేయనెంచి తా
మోటమినొప్ప నేరక నయోమయ పౌరుల కళ్ళు గప్పగన్
బూటకమైన వార్తలను ముద్రణ జేసిరి యీవిధంబుగన్:
"పూటిను గొప్పవాడనుచు పూజలు జేసిరి యూక్రెయిన్ జనుల్"
(నిరంకుశులు, ముఖ్యంగా యుద్ధసమయాలలో, తమ ప్రజల మద్దతుకై శత్రువులు ఓడిపోయారని తప్పుడు వార్తలు ప్రచురిస్తారు. ఆ విధంగా రష్యాలో ఈ తప్పుడు వార్త ప్రచురింపబడినదని నా భావం)

Friday, June 3, 2022

 సమస్య - సానులతో చెలిమి మోక్షసాధనము గదా!

కం//
ఐనిస్టైన్-బోసులు పర
మాణువునకొకటి యుపపరమాణువుచూపన్
తాననె హాకిన్స్ ఈ 'బో
సాను'లతో చెలిమి 'మోక్షసాధనము' గదా!

Satyendranath Bose and Einstein proposed a sub-atomic particle called Boson. When it was discovered in 2012, Stephen Hawkins, a famous Physicist, suggested that unstable Higgs-Boson leaves the way open for a catastrophic cosmic wipe-out. ఇక్కడ 'మోక్షసాధనము ' ఈ cosmic wipe-outను వ్యంగ్యముగా సూచిస్తూ వాడబడినది.

Sunday, May 29, 2022

కం//

ఆసులు పస పేకాటకు,

రాసులు పస ధాన్యములకు, రవికలకెల్లన్

లేసులు పస, బౌలర్లకు

పేసులు పస భువనమందు, వినరా శ్యామా!


Friday, May 27, 2022

 సమస్య: నిరుపేదగృహంబున సిరి నెలవుండుసదా!

కం//
చరవాణి చేతనుండక
జరుగునె పనులొక్కటైన జగతిన జూడన్!
తిరముగ నీ రోజులలో
నిరుపేదగృహంబున 'సిరి' నెలవుండుసదా!

(ఐఫోను లోని 'సిరి' గా భావించవలెను - పేదల దగ్గర కూడా ఐఫోన్ ఉండవలసి వస్తోంది/ఉంటున్నాయి అని పూరణ)