Wednesday, July 13, 2011

అష్టావధానము - డా.మేడసాని మోహన్ - రెండవ భాగము

వర్ణన: 18వ తానా ద్వైవార్షిక సభలను వర్ణించమని కోరారు.




           నవ విన్యాస విలాస వైభవము సంధానమ్ము గావించుచున్

           వివిధోద్వీర కళాప్రసంగములలో విద్వత్స్పురద్గోష్ఠిలో

           దివినే మైమరపింపజేసెడి మహోత్తేజంబు తానా సభా

           నివతస్ఫూర్తుల గోచరించెడిది వర్ణింపన్ అసఖ్యంబగున్



ఆశువు-1: తానా సభలకు వచ్చిన కోనేటిరాయుడిని స్తుతిస్తూ..



           తిరుమల వేంకటేశ్వరుడి దివ్య మహాద్భుత వైభవంబులన్

           సరసత అన్నమయ్య విరసత్ స్థవదీయ శుభ ప్రసంగముల్

           పరగగ జేసినాడవు భవ్య గుణోన్నతి ఇందువచ్చినన్

           కరములనెత్తి తా నమెరికా ధర సుస్థలి గూడ కొల్చు సు

           స్థిరతను గాంచి వేంకటపతిన్ నుతియింతును భక్తి యుక్తి తోన్



ఆశువు-2: తానా వారి తెలుగు భోజనం వర్ణిస్తూ..



           విలసితప్రసన్న రుచుల వేడ్కగొల్పునట్టివై

           అలకులికిన మంచిరుచులు అద్భుతావహంబులై

           తెలుగువారి వంటకాల దివ్యరుచులతోడ ఈ

           ఇల వహించి తాన వార మెచ్చుచుంటి తీయగన్





ఆశువు-3: బంగారు భవిష్యత్తుకై పిల్లలను అమెరికా పంపించి, వారిని విడిచి ఉండలేక అమెరికా వచ్చి, ఇక్కడ ఇమడలేక సతమతమయ్యే పెద్దలను వర్ణించ వలెను.



                 భారతీయ జీవన విధా ప్రభితమైన

                 ఆర్ద్ర భావన మనములో అమరి యుండ

                 ఇక్కడి నివాస యోగ్యమౌ ఇక్కటులకు

                 పెద్దలుండంగజాలరు ఇద్ద చరిత



కాయ పఠణము-1: జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కుంతీ కుమారి నుండి

కావ్య పఠణము -2: నంది తిమ్మన విరచిత పారిజాతాపహరణము నుండి

కావ్య పఠణము-3: రామరాజ భూషణుని వసుచరిత్ర నుండి



అప్రస్తుతము:

1. అర్ధనారీశ్వరుడు హైదరాబాదు బస్సు ఎక్కితే ఆడవారి సీటులో కూర్చోవాలా లేక మగవారి సీటులోనా?

2. అరుంధతి పెళ్ళిలో ఆమెకు ఏ నక్షత్రం చూపించారంటారు?

3. పెళ్ళిలో ఉప్మా ఎందుకు అంత రుచిగా ఉంటుంది?

4. అందరూ శృంగార పరమైన సమస్యలడుగుతున్నారు. మ్యాచ్ ఫిక్సింగేమైనా జరిగిందా?

5. కోడి లెక్కలంటే ఏమిటి?

6. సిగరెట్టు త్రాగాడని, నీళ్ళు నమిలాడని అంటారేమిటి?

7. ఐశ్వర్యారాయ్ కి పుట్టేది మగ పిల్లడా ఆడపిల్లా?





ముగింపు:

అవధానిగారు తుఫాన్ ఎక్స్‌ప్రెస్సు వేగంలో పద్యాలు చెప్పడం మూలంగానూ, నా రికార్డింగుని మళ్ళి మళ్ళీ విని నే వ్రాసిన తప్పులు సవరించే సమయం నాకు లేకపోవడం మూలంగా, పైన పద్యాలలో కొన్ని తప్పులు దొర్లి ఉండవచ్చు. ఆ తప్పులు నావిగా భావించి మన్నించ గలరు.



జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు, గొల్లపూడి మారుతీ రావు వంటి ప్రభుతులు సభలో ఉండడం మూలంగా అవధాని ఇంతకుపూర్వం వారిచ్చిన సమస్యలకు తన పూరణలు చెప్పి సభనలరించారు. అక్కిరాజు గారు శ్రావ్యమైన గళంతో కావ్యపఠణానికి వన్నె తెచ్చారు. సమయాభాం వలననుకుంటా చివరి ఆవృత్తంలో ఆశువు మరియు కావ్యపఠనము అంశాలను వదిలివేసారు. అప్రస్తుత ప్రసంగంలోని కొన్ని ప్రశ్నలకు అవధానిగారు చమత్కారంగా సమాధానాలిచ్చినా కొన్నిటిని దాటేసారనిపించింది. అయినాకానీ, ఇచ్చిన సమస్యలే కాకుండా చాలా ఉదారణలతో, చమత్కారాలతో అవధానాన్ని చక్కగా నిర్వహించి రక్తి కట్టించారు మేడసాని మోహన్ గారు.

Tuesday, July 5, 2011

అష్టావధానము - డా.మేడసాని మోహన్ - మొదటి భాగము

తానా (TANA - Telugu Association of North America) వారి 18వ ద్వైవార్షిక తెలుగు సమావేశాలలో జూలై 3, 2011 వ తారీకున సాంతాక్లారా నగరంలో డా.మేడసాని మోహన్ గారి అష్టావధానము జరిగింది. అందులో ఒక పృచ్ఛకుడిగా పాల్గొనే అదృష్టము నాకు కలిగింది. దాని వివరాలు క్రింద ఇస్తున్నాను:
అధ్యక్షులు: డా. అక్కి రెడ్డి (మోహన్ గారి గురువులు)
పృచ్ఛకులు:
  • నిషిద్ధాక్షరి: తల్లాప్రగడ రామచంద్ర రావు
  • న్యస్తాక్షరి: నచకి (నల్లాన్‌చక్రవర్తుల కిరణ్)
  • దత్తపది: పుల్లెల శ్యామసుందర రావు
  • సమస్య: ఉపద్రష్ట సత్యం
  • కావ్య పఠణము: అక్కిరాజు సుందర రామకృష్ణ
  • ఆశువు: తిరుమలపెద్దింటి నరసింహాచార్యులు
  • వర్ణన: కాజా రామకృష్ణ
  • అప్రస్తుత ప్రసంగము: గొర్తి బ్రహ్మానందం.
నిషిద్ధాక్షరి: మడి అచారముయొక్క వైజ్ఞానికతను/గొప్పతనాని వివరిస్తూ కందం.

        శ్రీమాన్య శుభ్ర భావము
        ధీమయ సర్వప్రసన్న ధిగ్ద పరవిధిన్
        స్థేమానంత మనోగుణ
        ధామం బాచార ఘటన ధన్యత గూర్చున్


న్యస్తాక్షరి: భారత్ దేశంలో పెరుగుతున్న అవనీతి గురించి శార్ధూలము
  • 1వ పాదం: 6వ అక్షరం - నీ
  • 2వ పాదం: 13వ అక్షరం - ధీ
  • 3వ పాదం: 15వ అక్షరం - స్త
  • 4వ పాదం: 8వ అక్షరం - భా
        నాదేశంబవినీతి మార్గమున విన్యస్తంబుగా నొప్పుచో
        ధీధుర్యుల్ వికలస్వభావముల సంధిగ్దాత్ములై కుందగా
        వేదాద్యుత్వల సంప్రదాయ గతులన్ విద్వస్తముంజేయ,తత్
        గాధల్ సంస్మరియించి భాసుర పదాకాంక్షన్ నుతింతున్ హరిన్


దత్తపది: రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ పదముల నుపయోగించుచూ, సుఖసంసారమునకు మార్గములు సూచించుచూ, ఒక స్వేచ్ఛా వృత్తం చెప్పవలెను.

        రాజస్పూర్తి వహించు సుప్రణయ సంభ్రంభంబులింపారగా
        తేజంబొప్పు పురూర యూర్వశివిభా దీప్తిం ప్రసన్నాత్ములై
       పూజల్ గైకొనినట్టి మేనకళలన్ పొందింప దాంపత్య హే
       లా జాగ్రత్పధ భాతిలోత్తమగతుల్ లాస్యంబులై మించగన్


సమస్య: స్తనములులేని పూరుషుడు సంస్థవనీయుడుకాడు ధాత్రిలో

        అనుపమమైన సంపదల అద్భుతహేల వహించి యుండియున్
        ఘనతర వీరవిక్రమ విఘట్టిత క్షాత్రవులై ఎసంగియున్
        నినదిత దివ్య భావుక ఘణీకృత సార ధురీణ భారతీ
        స్తనములులేని పూరుషుడు సంస్థవనీయుడుకాడు ధాత్రిలో

సరస్వతి యొక్క రెండు స్తనములను సంగీత సాహిత్యములుగా భావించి, "..భారతీ స్తనములు లేని పూరుషుడు.." గా పూరించడము జరిగినది.


మిగిలిన వివరాలు (వర్ణన, ఆశువు, నిషిద్దాక్షరిలో నిషేదింపబడిన అక్షరాలు మొ||), తరువాయి భాగములో...

భవదీయుడు,
పుష్యం