Thursday, May 20, 2021

 జడ పంచకం

రచన: పుల్లెల శ్యామసుందర్


కం//

పిరుదులుఁ దాకెడి జడలే

సరియైనవి యనుట తప్పు, చక్కగ ఇంపౌ

విరులను తురిమినచో జడ

కురచైనను సొగసులీను, కుదురుగ శ్యామా!


కం//

నూనెలు పడిపడి పూసిన

జానెడు పొడుగున్న జడలు చకచక పెరగవ్

దీనికి మూలము జెనెటిక్స్

పోనీ యని తలచుటెపుడు పుణ్యము శ్యామా



కం//

చీరలుఁ గట్టెడి పడతికి

బారెడు జడ సొగసు నిచ్చు, ప్యాంటులుఁ దొడిగే

నారికి ‘పోనీ టైలే’

గ్యారెంటీగా పొసగును, గదరా శ్యామా!



కం//

అబ్బో జడ పొడుగనుచున్

తబ్బుబ్బై పెండ్లియాడి, తననెల జీతం

కొబ్బరినూనెకు మరి ‘తల

సబ్బు’లకే చాల కేడ్చె, సరసుడు శ్యామా!



కం//

సన్నని నడుముకుఁ దోడగు

మిన్నగు లావాటి జడయె, మేలుర రామా!

సన్నని జడకున్ దోడగు

గున్నేనుగు వంటి నడుము, గోలర శ్యామా!