Wednesday, December 31, 2008

ఉత్పలమాలలో శుభాకాంక్షలు

ఉ//
నూతన వత్సరంబు ఇక నూతన శోభను తెచ్చు మీకు, ఆ
సీతయు రాముడున్ గలసి శీఘ్రమె దీవెనలెన్నొ ఇవ్వ, మీ
పాతవి కష్టముల్ తొలగి, పట్టిన కార్యములెల్ల తీరి, మీ
చేతుల నిండుగా ధనము చేరగ చింతలు తీరు గ్రక్కునన్

Sunday, November 9, 2008

అమెరికా పద్యాలు

సిలికానాంధ్రా వారి సర్వధారీ నామ సంవత్సర ఉగాది సంబరాలలో జరిగిన కవి సమ్మేళనంలో నేను చదివిన పద్యాలివి. హాస్యం కోసం కొంత, ప్రాసకోసం కొంత, ముఖ్యంగా భాషాజ్ఞానలోపం వలన, అనుకున్న కంటే ఎక్కువగా ఆంగ్లపదాలు వాడవలసి వచ్చింది.

గురు స్మరణ: కవిత్వం చెప్పేముందు చదువు నేర్పిన గురువులను స్మరించడం మన భారతీయుల ఆనవాయితి.
కం//
దుంపలబడిలో గురువులు
చెంపలు వాయించి అపుడు చెప్పిన చదువే
పంపెను కదరా మనలను
గుంపులుగా చేరి ఇచట గోష్ఠులు చేయన్

(నేపథ్యం: అమెరికా వచ్చిన ఒక బామ్మగారు భారత దేశంలో ఉన్న తన మనమరాలికి ఇక్కడ తను చూచిన విషయాలు వివరిస్తూ వ్రాసిన ఉత్తరమిది.)

అమ్మీ,

ఇక్కడకు క్షేమంగా చేరి ఇంచుమించుగా నెల్లాళ్ళయింది. అమెరికా వచ్చిన తరువాత నీకు ఉత్తరం రాస్తానన్నాను కదా. ఇవిగో ఇక్కడి విశేషాలు.

కం//
వచ్చిన క్రొత్తన యన్నియు
చచ్చెడి తికమకగ నుండు, చాలాకాలం
స్విచ్చి పనితీరు తెలియదు,
వచ్చుఁ బగలు నిద్ర, రాత్రి వచ్చును జెట్‌లాగ్!

కం//
దూరము నిక్కడ మనుజులు
కారున పయనింప బట్టు ఘడియల గొలుతుర్
ఊరుకి నూరుకి దూరము
ఆరున్నర గంటలెటుల నడగకె భామా!!

కం//
నిక్కరును షార్టు యందురు,
గెక్కో యగునిచట బల్లి, గేసగు పెట్రోల్,
ట్రక్కనెదరు లారీనిట,
చెక్కని బిల్లుని పిలుతురు, చెప్పెద వినుమా!

ఆ.వె//
బెండకాయ మరియు బీరకాయలె గాక
దొండకాయ కూడ దొరకునిచట,
చక్కగనవియుండ సాలడు పేరున
ఆకులను దినెదరు మేకలాగ!!

కం//
పచ్చడి లేకున్న జిహ్వ
చచ్చునులే తినగ నిచటి చప్పటి కూరల్,
నచ్చదు వీరికి కారం,
వచ్చునె రుచి మిరప లేక వంటల కెపుడున్?!!

కం//
వీకెండున యిల్లువదలి
పోకుండా యుండలేరు, బుర్రకు బోరింగ్
కాకుండా హైకింగని
ఏ కొండో ఎక్కివత్తురిచ్చటి మనుజుల్!!

కం//
తూకం చూసుకు బాబోయ్
హౌకం నేనింతబరువు యయినా ననుచున్
వాకింగ్ చేసెదరాపై
బైకింగే పగలు రాత్రి, బరువది తగ్గన్!!

బామ్మ ఎప్పుడూ వంకలే యెంచుతుందనుకోకు. ఇక్కడ కొన్ని బాగున్న విషయాలివిగో.

కం//
ఎవ్వరినెవ్వరు జూచిన
రువ్వెదరొక చిన్న నవ్వు, రూలది, యేమీ
యవ్వారమనుచుఁ దలపక
నవ్వగవలె నీవుగూడ, నాకది నచ్చెన్!!

కం//
పుచ్చుల వుండవు కూరన,
వచ్చునులే వేడినీళ్ళు పంపున యెపుడున్.
బొచ్చున్న కుక్కలధికము.
మచ్చుకకుఁ గానరావు మశకము లిచటన్!!

చెప్పాలంటే యింకా చాలా విషయాలున్నాయి. మిగిలిన విశేషాలు తరువాత ఉత్తరంలో రాస్తాను.

దీవెనలతో,
నీ బామ్మ

Thursday, October 30, 2008

ద్విపదలో ఓటెయ్యండి

నవంబరు 4న అమెరికాలో ఎన్నికలు. ఈమధ్య జరిగిన సర్వేలో (California Bay Areaలో) ఆఫీసుకు ఆలశ్యమవుతుందని చాలామంది ఓటు వెయ్యరని చదివాను. If you don't vote, you lose your right to voice your concerns.


ద్విపద//

ఓటేయరా నీవు ఓటేయకున్న
మాటాడగలహక్కు మట్టిలో మిగులు

డ్యూటీగ భావించు ఓటెయ్యడమును
లేటౌను నాకంటు బ్లేములొద్దోయి

తూటాలకన్న పోరాటాలకన్న
మేటిరా శక్తిలో ఓటుఎన్నడును

ఓటేయరా నీవు ఓటేయకుండ
దాటేసినావంటె తంటాలు నీకె

Sunday, October 26, 2008

'తాటి' పద్యాలు

నిన్న దీపావళి టపాకాయలు కొందామని ఒక చైనీస్ కొట్టుకు వెడితే అక్కడ canned తాటిముంజలు కనపడ్డాయి. తెచ్చి వాటిని తింటూంటే పాత రోజులు గుర్తుకు వచ్చాయి.

ఏప్రిల్లో బడి అయిపోయినతరువాత కాలవగట్టమ్మట సైకిలు తొక్కుకుంటూ ఇంటికి వెళుతుంటే అప్పుడప్పుడూ తాటిముంజలమ్మేవాడు దేవుడిలా ఎదురొచ్చేవాడు.

ఉ//
వేసవి కాలమందలసి వేడిభరించుట చాల కష్టమై
మూసిన కళ్ళతో యతని మోము తలంచుచు మ్రొక్కి వేడగా
దాసుడి రక్షకై యతడు తారసమాయెను భూమిపై వడిన్
వాసివి తాటిముంజలను పైకము కమ్మెడివాని రూపునన్

(సైకిలు త్రొక్కుతున్నప్పుడు కూడా ప్రాసకోసం కళ్ళు మూసుకోవలసి వచ్చింది :-)

పల్లెటూళ్ళలో పెరిగిన పిల్లలందరికీ వేసవిలో తాటికాయలతో తోపుడు బళ్ళు చేసుకుని ఆడుకోవడం ఆనవాయితి.

ఉ//
తిన్నని తాటిమట్టగని తెప్పున కన్నము చేసి అందు నో
సన్నని కర్రపుల్లొదవి చక్కని గుండ్రని తాటికాయలన్
ఎన్నిక చేసి వాటముగ నీదరి నాదరి గ్రుచ్చి నంత నో
మిన్నగు తోపుబండగును మేలుగ పిల్లలు ఆటలాడగా

కం//
లెక్కకు మూడవి ఉన్నను
ముక్కంటికి కన్ను ఒకటి మూసుకునుండున్
నిక్కముగా ముక్కంటది
చక్కనిదొక తాటికాయ సరసుడ వినుమా!

Thursday, October 23, 2008

ఉత్పలమాల

(వ్యాఖ్యల ననుసరించి కొద్దిగా సవరించిన పద్యం)
ఉ//
బ్లాగుని వ్రాయగా తలచి బ్లాగుట నేర్వగ పట్టుపట్టి నే
గూగులు బాగుగా వెదకి కొద్దిగ మార్గము కానరాగ వే
వేగమె బ్లాగునుందెరచి వేసితినొక్క టపాను ఇంక నా
వాగుడు పద్యరూపమున వ్రాయగ యత్నము చేసెదన్ సుమీ!

(మొదట వ్రాసినది)

ఉ//
బ్లాగుని వ్రాయగా తలచి బ్లాగుట నేర్వగ కూరుచుండి నే
గూగులు బాగుగా వెతకి కొంచము జ్ఞానము పొందినంత వే
వేగమె బ్లాగునుందెరచి వేసితి నొక్క టపాను, ఇంకనా
వాగుడు పద్యరూపమున వ్రాయుటకున్ ప్రయత్నించెదన్, భళీ!


Monday, October 20, 2008

నేనెందుకు బ్లాగుతాను

అనుకోకుండా క్రొద్దిరోజుల క్రితం నా పాత మిత్రుడి బ్లాగుకి వెళ్ళి దాని ద్వారా మిగిలిన కొన్ని తెలుగు బ్లాగులను చూచిన తరువాత, బ్లాగ్ప్రపంచంలో నేను చాలా వెనబడి ఉన్నానని అనిపించింది. అడపాదడపా నేను వ్రాసిన పద్యాలతో నా బంధుమిత్రులు కొందరిని బాధపెడుతూ ఉంటాను. ఈ బ్లాగు పేరుతో ఇంకొంతమంది తెలియని వాళ్ళని కూడా నా అభిప్రాయాలకు/పద్యాలకు బలి చెయ్యొచ్చని తెలిసి మొదలు పెట్టాను. ప్రోగ్రామింగు నేర్చుకుంటున్నప్పుడు మొదటి ప్రోగ్రాము "hello! World!" లాగా, చాల బ్లాగులలో 'నేనెందుకు బ్లాగుతాను' అనేది మొదటి టపాగా చూచి, సరే సాంప్రదాయభంగమెందుకని అదే అంశంగా నా మొదటి టపాని ప్రచురించడానికి ఇది నా ప్రయత్నం. Green Initiative పేరుతో అందరూ recycling చెయ్యండో అని అంటున్నారు కాబట్టి, నా పాత పద్యాన్ని ఒకదాన్ని recycle చేసి ఇక్కడ ఇస్తున్నాను.

కం//
కొద్దిగ సమయము దొరికిన
ఒద్దికగా వ్రాయనేర్తు నొకటో రెండో
పెద్దవి రచనలు కుదరవు
పెద్దన చెప్పిన సుఖములు పెక్కుగ లేకన్

చదివి ఆనందిస్తారని ఆశిస్తూ..