Wednesday, July 22, 2009

పాత మిత్రులు -- పద్యాలు

పొద్దు పత్రికవారు విరోధినామ సంవత్సర ఉగాది సంధర్భంగా జరిపిన అంతర్జాల కవిసమ్మేళనంలో వర్ణన అంశం క్రింద ఇద్దరు పాత మిత్రులు చాలాకాలం తరువాత కలిస్తే ఎలాఉంటుందో వర్ణించమన్నారు. దానికి నేను చేసిన ప్రయత్నం.

చాలా కాలం తరవాత పాత మిత్రుడ్ని కలుసుకున్న ఒక సాయంకాలం.

తలుపుతీసి ఆనందంగా,

కం//
"ఎన్నాళ్ళయ్యెను చూడక;
ఇన్నాళ్ళకు కలసినావు, ఏమయ్యావోయ్?
చిన్నప్పుడు కలవడమే,
ఎన్నోమారులు తలచితి, ఈవిడ నడుగోయ్!!"

అంటూ పరామర్శలయిన తరువాత,

కం//
వేళాకోళము లాడుతు,
ఖాళీ బుర్రను తడుముతు, కబురులు చెబుతూ,
భోళా నవ్వులు నవ్వుతు,
గోళీలాడిన దినములె గొప్పవి అనుచున్.

కం//
బొండాం శ్రీనుని తలచిరి,
గుండే ఎల్లప్పుడుండు గుర్నాధాన్నీ,
కండలు తిరిగిన బాలిక
ఆండాళును కూడ తలచి రానందంగా.

కం//
ఆడిన సినిమా లన్నియు
చూడ చదువొదలి సెకెండు షోలకు వెళుతూ
తోడగు దొంగల మాదిరి
గోడలు దూకిన దినములు గుర్తుకు తెస్తూ

కం//
“ఫైటంటే కాంతారావ్,
పాటంటే ఘంటసాల, బాగా ఫేమస్
షాటంటే ఎన్.టీ.ఆర్,
ఆటంటే జ్యోతిలక్ష్మి, ఆరోజుల్లో”

అంటూ పాత రోజులను తలచు కున్నారు.

కం//
ఇల్లాలిచ్చిన ప్లేటున
పల్లీలను నోటవేసి పటపట తినుచున్,
మెల్లగ సాయంత్రంబున
సిల్లీగా జోకులేస్తు, చీకటిదాకా…

మిత్రుడితో గడపి, ఆపై

కం//
"మళ్ళీ కలవాలయ్యా.
ఊళ్ళోనే ఉండి కూడ ఊసుల కోసం,
వాళ్ళూవీళ్ళెందుకు. మన
పెళ్ళాలిరువురును మంచి ఫ్రెండ్సయ్యారోయ్"

అంటూ సాగనంపాడు..


(పైన ఉన్న "ఫైటంటే" పద్యం సర్వ-గురు కందం. కందం నియమాల ప్రకారం 6, 14 గణాలలో తప్ప మిగిలినవన్నీ గురువులే. దీనిని కుఱచ కందం అని కూడా అంటారు)

Monday, June 1, 2009

కవిత్వం ఎలా ఉండకూడదు..

చాలా మంది కవులు కవిత్వం ఎలాఉండాలి అని నిర్వచించారు గాని, ఎలా ఉండకూడదో చెప్పలేదు. కవిత్వం ఎలాఉండాలని పెద్దన చెప్పిన పద్యం అందరకూ తెలిసిందే. పెద్దన పద్యం చెప్పగానే చమత్కారంగా రామభధ్ర కవి ఈ క్రింది పద్యం చెప్పాడట. ఇంచుమించుగా ఒక ఏడాది క్రితం మా ఊళ్ళో జరిగిన 'అమెరికా సాహితీ సదస్సు'లో రేవూరి పద్మనాభరావుగారు కవిత్వంలో చమత్కారం గురించి ప్రసంగిస్తూ ఈ విషయం చెప్పారు. తరువాత ఆయన చెప్పగా నేను వ్రాసుకున్న కాగితం తప్పిపోయి నిన్ననే దొరికింది. అయితే అందులో కొన్ని అక్షరాలు చెరిగిపోయి సరిగా కనిపించడం లేదు. ముఖ్యంగా అయిదవపాదంలో కొన్ని అక్షరాలు తెలియడంలేదు. ఈ పద్యం తెలిసిన వాళ్ళు చెప్పగలరు.



నెరిచెడుపాడు భావములు, నిద్దురపోయెడు కుంభకర్ణుగు
ర్గురురురురావముల్, మనసు కోరినవాడు నిరాకరింప సుం
దరి మరి వెక్కివెక్కి విలపింపగ వచ్చెడి పిచ్చికూతలం
దిరుకు కెకెక్కెకె ధ్వనులు, ఇత్తడి చెంబున రాళ్ళు పోసి గి
ర్గిరగిర ద్రిప్పనుప్ప ????, గాడిదమూకలు కొల్వుదీర్చి సుం
దరముగ గొంతు విప్పి సరదాపడి రాగము లాలపించు, బం
డరములు రుబ్బు పొత్తరము నానిన గారెల పొట్టు ఇట్టు న
ట్టొరసి నిరంతరంబు గరరో గరరోయని చేయు శబ్దముల్,
తిరముగ నిల్ప కావ్య సరళిన్ రచియింపగరాదు సత్కవుల్

Sunday, March 29, 2009

ఆవకాయ - పద్యాలు

కాలిఫోర్నియాలోని సిలికాన్‌వేలీలో మార్చి 28న సిలికానాంధ్రా వారి శ్రీ విరోధీనామ సంవత్సర ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. దానిలో భాగంగా జరిగిన కవి సమ్మేళనములో నేను చదివిన పద్యాలు.


కం//
శ్రేష్టంబిది పచ్చళ్ళన,
టేష్టున ఇది మొదటనుండు డెఫినెట్ గానూ,
ఇష్టముగ ఆవకాయను
సుష్టుగ తిని దొర్లినంత సుఖమది కలదే!


(ఈ పై పద్యం లోని ఆఖరి రెండు పాదాలూ, కవి మిత్రులు 'ఆత్రేయ' గారి అనుమతితో వారి ఒక పద్యమునుంచి 'లేపిన'వి.)


కం//
ఊరిన ముక్కను కొరకగ,
ఔరా! అది ఎంత రుచిని అందించునయా,
కూరిమితొ నాల్గు ముక్కలు
నోరారా తినని నోరు నోరవ్వదుపో!

కం//
బెల్లము వేసిన మధురము,
పల్లీనూనెను కలపగ పచ్చడి మధురం,
వెల్లుల్లి వేయ మధురము,
పుల్లని మామిడితొ చేయ ముక్కది మధురం!!


ఈ ఆవకాయలోని ముక్కకి చాలా పేర్లు ఉన్నాయి:

కం//
చెక్కందురు, డిప్పందురు,
ముక్కందురు కొంతమంది మురిపెము తోడన్.
డొక్కందురు, మామిడి దిది
పిక్కందురు దీనికన్ని పేర్లున్నవయా!


ఆవకాయ ఉపయోగాలు:

కం//
ఉదయమె బ్రెడ్డున జాముకు
బదులుగ ఇదివాడిచూడు, బ్రహ్మాండములే,
అదియేమి మహిమొ తెలియదు,
పదునుగ నీ బుర్ర అపుడు పనిచేయునయా!


కం//
ఇందువల దందు బాగని
సందేహము వలదు; ఊట సర్వ రుచిహరం
బెందెందు కలపి చూసిన,
అందందే రుచిగనుండు, అద్భుత రీతిన్!


ఆవకాయ అవతరణ:

కం//
“చప్పటి దుంపలు తినుచును,
తిప్పలు పడుచుంటిమయ్య, దేవా, దయతో
గొప్పగు మార్గం బొక్కటి
చెప్పుము మా నాల్కలొక్క చింతలు తీర్పన్”

అంటూ,

కం//
ముక్కోటి దేవులందరు
మ్రొక్కగ తా జిహ్వలేప సృష్టించెనయా
చక్కనిది ఆవకాయన
ముక్క తినని వాడు కొండముచ్చై పుట్టున్!!


కం//
చారెరుగనివాడును, గో
దారిన తా నొక్కమారు తడవని వాడున్,
కూరిమిన ఆవకాయను
ఆరారగ తిననివాడు, ఆంధ్రుడు కాడోయ్!

Wednesday, March 11, 2009

శ్రీనాధుడి చాటువు

పని ఒత్తిడి వలన ఈ మధ్య తెలుగు బ్లాగ్లోకంలో గడపడానికి సమయం చిక్కలేదు.


కం//

ఇక్కడి జీవిత మింతే,

లెక్కకు సౌకర్యమున్న లేదులె సమయం;

ఎక్కడ, తీరిక దొరకదు.

చక్కగ ఈ బ్లాగులన్ని చదువుట కొఱకై


చాలా రోజుల తరువాత బ్లాగులు తిరగేస్తూ ఉంటే శ్రీనాధుడి చాటువొకటి కనపడింది.

వెంటనే శ్రీనాధుడి ఇంకొక చాటువు గుర్తుకొచ్చింది.

నా తప్పేంలేదంటూ, అలాంటి సమర్ధింపే ఈ చాటువులో కూడా చూడండి:


గుబ్బలగుమ్మ, లేచిగురు కొమ్మ, సువర్ణపు కీలుబొమ్మ, భల్

గిబ్బిమిఠారి చూపులది, కాపుది, దానికి ఏల ఒక్కనిన్

బెబ్బులి నంటగట్టితివి, పెద్దవునిన్ననరాదు గాని, దా

నబ్బ, పయోజగర్భ, మొగనాలికి ఇంత విలాసమేటికిన్!!


తాత్పర్యం:
ఓ బ్రహ్మా (దానబ్బ, పయోజ గర్భ), ఇంతటి అందగత్తెకు (గుబ్బల గుమ్మ, లేచిగురు కొమ్మ, సువర్ణపు కీలుబొమ్మ) ఒక బెబ్బులి లాంటి వాడినెందుకు అంటగట్టావయ్యా?? అంతే కాకుండా, ఇలాంటి వివాహితకు (మొగనాలికి) ఇంత విలాసమెందుకిచ్చావయ్యా? (కవిహృదయం ఏమిటంటే, ఆమెను వలచడంలో నా తప్పేమీ లేదు, సృష్టించిన నీదే తప్పు అని )




Saturday, February 7, 2009

అంతర్జాలంలో పద్యాలు - జనవరి 2009 సమీక్ష

ఆకాశవాణి, అంతర్జాల కేంద్రం. అంతర్జాలంలో ఈ మాసం (జనవరి 2009) నమోదైన పద్యాలవానల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సాధారణంగా పద్యాల వానకురిసే 'ఆంధ్రామృతం', 'తెలుగు పద్యం' వగైరా బ్లాగులలోనే కాకుండా, కొన్ని అనుకోని బ్లాగులలో కూడా 'వ్యాఖ్య'లలో ఒక మోస్తరునుండి భారీఎత్తున పద్యాల వాన కురవటం జరిగింది.


నెలారంభంలో వాన ప్రారంభించడానికి భైరవభట్ల గారు ప్రయత్నిచారు గాని, ఎందుకనో పెద్దగా వాన కురవలేదు.


వాన రాకకు సూచనగా కామోసు ఫణిగారు బ్లాగులో గట్టిగా ఉరిమారు.


ఈ నెల శ్రీ రాఘవ గారి బ్లాగులో ఉధృతంగా పద్య వర్షాలు కురిసాయి. ఆ వానలు 'శ్రీ శ్రీ లేకున్ననేమి సిరిసిరి మువ్వా' తో ప్రారంభమై, మధ్యలో 'శ్రీ శ్రీ నిక తలచునెవడు సిరిసిరిమువ్వా' అనుకుని చివరకు 'సవ్వాలే లేదు.. ఇటువంటి సరసపు కవనం.. వెవ్వెడల వెదక కనగలమే' అని నిర్ధారించుకున్న తరువాత ఆగాయి.


ఆచార్య ఫణీంద్రగారి బ్లాగులో వీధిదీపం దగ్గర నిలబడి పానీపూరి తింటూంటే చక్కని పద్యవాన కురిసింది.


మీసంలో తెల్లవెంట్రుక గురించి కొత్తపాళీ గారు బాధపడుతుంటే, అనుకోని విధంగా అక్కడ వ్యాఖ్యలలో కొద్ది వానలతో ప్రారంభమైన అల్పపీడనం తూర్పుదిశగా(*) పయనించి భైరవభట్ల గారి బ్లాగులో కేశంతో క్లేశం గా తీరాన్ని దాటింది.


పద్యాలు వ్రాయడం నేర్చుకుంటున్నాను అంటూనే ఆత్రేయగారు తన కంద కదంబం బ్లాగులో నవరసాల్లో భారియెత్తున పద్యవానలు కురిపించడం ప్రారంభించారు.


ఆంధ్రామృతం బ్లాగులో 'మేలిమి బంగారం మన సంస్కృతి', 'సమాధానం కనుక్కొండి చూద్దాం' వగైరా శీర్షికలతో చిరపుంజిని మించిపోతూ, ఇంచుమించుగా ప్రతిరోజూ పద్య వర్షం కురిసింది.


ఇక కొసమెరుపుగా నెలాఖరి రోజున, వాగ్విలాసము బ్లాగులో రాఘవగారు, చిత్రంగా పద్యవర్షం కురిపించారు.


ప్రస్తుత అంచనాల ప్రకారం వచ్చే నెలలో కూడా ఇలాగే పద్యవానలు కొనసాగే అవకాశాలు చాలా కనపడుతున్నాయి.



(టపాలలో వచ్చిన పద్యాలు కూడలి, జల్లెడ మొదలైన వాటిలో కనపడినా, వ్యాఖ్యలలో వచ్చినవి ఆ బ్లాగుని అనుసరించితే తప్ప తెలియవు కాబట్టి, పద్యాలంటే ఆసక్తి ఉన్నవారి సౌలభ్యం కోసం ఇలా నెలకొకసారి అంతర్జాలంలో పద్యాలను సమీక్షించాలని నా ప్రయత్నం. ఇవి నేను చదివిన బ్లాగులలో వచ్చినవి మాత్రమే. నేను ఇంకా ఏవైనా పద్యాలు అచ్చయిన బ్లాగులను మరచినచో తెలియచేయగలరు)

Monday, January 5, 2009

మత్తకోకిలలో ఛుకుఛుకు రైలు - పద్యం

చిన్నపిల్లల పాటలలో 'ఛుకుఛుకు రైలు వస్తోంది' అన్నపాట చాలమందికి తెలుసు. మొన్ననే మా అమ్మయికి ఆ పాట నేర్పిస్తుంటే దానిని ఛంధోభద్ధంగా వ్రాస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. లయబద్ధంగా ఉంటుందని మత్తకోకిలలో వ్రాయడానికి ప్రయత్నించాను (మత్తకోకిల పద్యాన్ని 'మత్తకోకిల-మత్తకోకిల-మత్తకోకిల-కోకిలా' అన్న లయతో చదివితే వినడానికి బావుంటుంది).

మూలం: (ఎవరు వ్రాసారో నాకు తెలియదు)

ఛుకుఛుకు రైలు వస్తోంది
పక్కకు పక్కకు జరగండి
ఆగినాక ఎక్కండి
జోజో పాపాయ్ ఏడవకు
లడ్డూ మిఠాయి తినిపిస్తా
చల్లని పాలు త్రాగిస్తా

నా ప్రయత్నం:

మ.కో//
ఛుక్కుఛుక్కని వచ్చుచున్నది జోరు రైలది చూడరా
పక్కపక్కకు నక్కి, ఆగిన బండి నీవపుడెక్కరా
గుక్క పెట్టకు, జోలపాడెద, గోల నీవిక చేయకే
చక్కనైన మిఠాయి తోడుగ చల్లపాలను ఇచ్చెదన్

Thursday, January 1, 2009

Eliot కవితకు పద్యానువాదం

ఇది భైరవభట్ల గారి టపాకు సమాధానంగా వ్రాసినది. నేను Eliot కవితలు ఎప్పుడూ చదవలేదు. అందువలన నేను అక్కడ ఇచ్చిన ఆంగ్లవాక్యాలను తర్జుమా చేయడానికి మాత్రమే ప్రయత్నించాను. భావం మారినచో క్షమించగలరు.

కం//
అనువగు చోటును వెదకుచు
మనుజుడు తా తిరుగు లోకమంత, అతడు శో
ధనచేయుట మాన వలదు
కనుగొన మొదలిడిన చోటె ఘనమని శ్యామా!

ఇంచుమించుగా పది సంవత్సరాల క్రితం ఒక Airline advertisement చూచాను(British Ariways అనుకుంటా). అది (ఇంచుమించుగా) ఇలా ఉన్నట్టు గుర్తు: Man travels to many places to realise that Home is the best place on earth. Depend on us for your travels and to get back home. దీనికి స్ఫూరణ Eliot అని ఇప్పుడు నాకనిపిస్తోంది.