Monday, March 22, 2010

చమత్కార వికృతులు

అమెరికాలోని కాలిఫోర్నియా బే-ప్రాంతంలో సిలికానాంధ్రా వారు నిన్న వికృతినామ యుగాది సంబరం జరిపారు (ఇక్కడ అన్ని పండుగలు modulo weekendన జరుగుతాయి :-) . అందులో జరగిన కవిసమ్మేళనంలో నేను చదివిన పద్యాలివి. చమత్కారం కోసమని మనము చిన్నప్పుడు చదువుకున్న కొన్ని పద్యాలకు వ్రాసిన పేరడీలు. ఈ పేరడీలకు కారణమనదగ్గది పొద్దు పత్రికవారి ఉగాది కవిసమ్మేళనంలో ఇచ్చిన 'లావొక్కింతయు లేదు' తో ప్రారంభించి పద్యం వ్రాయమని ఇచ్చిన సమస్య.


'టీ కొట్టు నాయరు':

కం//
ఇందుగల డందు లేడని
సందేహము వలదు మీకు, చక్కగ నాయర్
ఎందెందు వెదకి చూచిన
అందే టీ కొట్టు పెట్టు, అద్భుత రీతిన్!!

-----------

ఈ రోజుల్లో ఎవరు డాబుగా మాట్లాడతాడో వాడే పైకి వస్తునాడు.

ఆ.వె//
అల్పుడెపుడు పల్కు ఆడంబరముగాను
అందువలనె వాడు అధికుడౌను
అరచునట్టి శునక మావులు కాయదా?
విశ్వదాభిరామ వినర శ్యామ!!


-------------

శతకకారుడు చక్కని పద్యమొకటుంటే చాలన్నాడు. దానినే ‘అల్లుడి గొంతెమ్మ కోర్కెలు’ కి అన్వయించుకుంటే:

ఆ.వె//
"నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు.
పట్టుపంచెలారు, వాచి ఒకటి.
తిండి తినగ నాకు వెండి కంచము చాలు.
చక్కనైన కారు చాలునాకు"

---------------

కం//
సిరిగల వానికి చెల్లును
తరుణులు పదియారు వేలు తగ పెండ్లాడన్
చిరు మానవునకు కుదరదు
'ఒరు’ పెండ్లామే సరిపడు ఓరిమి పోవన్!

-----------------------

గజేంద్ర మోక్షంలో పోతన 'లావొక్కింతయు లేదు' అని ఒక శార్ధూలము వ్రాశాడు. దానిని కొద్దిగా మారిస్తే:

ఒక తల్లి తనకు నచ్చిన అమ్మాయిని చూడమని కొడుకునుద్దేసించి:

కం//
“లావొక్కింతయు లేదుర,
జీవితమున నీకుమంచి చేదోడగురా.
పావని చక్కని పిల్లర,
నీవామెను చూడకున్న నేనొప్పనురా!!”

--------------------

ఇంట్లో సంగీతం నేర్చుకునే పిల్లలున్న వాళ్ళందరికీ తెలిసిన విషయం:

ఆ.వె//
అనగననగ రాగ మతిశయిల్లుచునుండు,
వినగవినగ చెవులు బిళ్ళ కట్టు.
పాట రాని పిల్ల పగలు రాత్రెరుగదోయ్,
విశ్వదాభిరామ వినర శ్యామ!!

౨౯-మార్చ్-౨౦౧౦
మా భా.భా.సం. సభ్యులు, పిల్ల బాధకంటే ఇల్లాలి పాట బాధ ఎక్కువుందంటే, వారికోసం మూడో పాదం మార్చాను :-)

.వె//
అనగననగ రాగ మతిశయిల్లుచునుండు,
వినగవినగ చెవులు బిళ్ళ కట్టు.
పాటరాని భార్య బాధ బ్రహ్మెరుగునా?
విశ్వదాభిరామ వినర శ్యామ!!

(అనుకోకుండా వ్రాసినా, ఇక్కడ చిన్న చమత్కారం దొర్లింది: బ్రహ్మ భార్య 'సంగీత' సరస్వతి కదా!!)
---------------------------


అమెరికాలో ఉండడం మూలంగా బంధువులు వచ్చే ప్రమాదం లేదుగాని, ఒక్క డాలరు సంపాదించినా Tax వాడు మటుకు తప్పక వస్తాడు. రాబోవు April 15th మాకు Tax Day. దానిని దృష్టిలో పెట్టుకుని:

కం//
ఎప్పుడు సంపద కలగిన
అప్పుడె ఆదాయపన్ను ఆడిటరొచ్చున్.
కుప్పలుగ చెప్పులున్నచొ
తప్పక శునకంబు వచ్చు, తథ్యము శ్యామా!!

పద్యాలు మీకు నచ్చుతాయని ఆశిస్తూ,
పుష్యం