Monday, March 29, 2021

 సమస్య - అవినీతి కథలు చదివిన ఆనందమగున్


కం.

రవి యనెడి రచయితొక్కడు

కవనంబున క్రైముఁ జేర్చి కథలను వ్రాయున్

నవరస భరితంబగు యా

అవినీతి కథలు చదివిన ఆనందమగున్


Saturday, March 27, 2021

 లింగమడ్డు వచ్చె గుడిని మ్రింగ బోవ


తే.గీ.

లింగమడ్డు వచ్చె గుడిని మ్రింగ బోవ

నీతిమాలిన యధికార్లు నిధులు దోచి

లింగమందురతని పేరు లింగరాజు

లింగరాజుండ గుడికిక బెంగ లేదు!

 బేరమాడబోవ నేరమాయె


ఆ.వె.

కోమలాంగి యొకతె కూరలమ్ముచు నుండ

బేరమాడబోవ నేరమాయె

యెపుడు సరుకుఁ గొనగ నెరుగని వానికీ

యట్టి శ్రద్ధదేల నడిగె భార్య!


Thursday, March 25, 2021

సమస్య - ఉద్యోగములే దండుగ


కం.     

"ఉద్యోగములే దండుగ?"

మిథ్యది విను, పొట్టకెట్లు మెతుకులు దొరకున్??

ఉద్యోగము లేకుండిన

సాధ్యమె సుఖజీవనమ్ము, జగతిన శ్యామా?


సమస్య: రక్తి లేని భక్తి ముక్తి నిడదు


ఆ.వె.

భక్తి చిత్రమందు భామల కేబరే

లేమిటనుచు నొకఁడు యీసడించ

దర్శకుండు నవ్వి తాత్పర్యముందెల్పె

"రక్తి లేని భక్తి ముక్తి నిడదు!" 

 (June 2010)


 క్రిందపడిననూ అరిచెను కేరింతలతో

కం|| 

సందడిఁ జేయకఁ జొరబడి
అందనిదౌ ఉట్టి కొట్టి అపుడు యశోదా
నందనుడా వెన్నంతయు
క్రిందపడిననూ అరిచెను కేరింతలతో

 కారమె యనిపించె తీపి కలకండవలే

 కం|| 

దోరగ వేగిన గారెలు
కారమె యనిపించె, తీపి కలకండవలే
బూరెలు తోచెను. మరి పులి
హారయు బహు రుచిగనుండె, ఆహా! ఓహో!

(పెళ్ళి భోజనం వర్ణన) (Aug, 2009)

 మగనిని కొట్టిన మగువయె మంచిది ఇలలో

కం||  

జగడములాడ సరసముగ

సిగలో పూదండ కదలి సొగసుగ ఒడిలో
తెగిపడిన
 మల్లె పూలతొ
మగనిని
 కొట్టిన మగువయె మంచిది ఇలలో

(June 2009)

 పలువురి తండ్రుల తనయుడు భక్తితొ మ్రొక్కెన్

కం//    

ఇలలో నింపగునొక స్త్రీ

వలువలు తాఁ మార్చినటుల పతులను మార్చెన్

నలుగురు 'నాన్న'లుఁ గలయా

పలువురి తండ్రుల తనయుడు భక్తితొ మ్రొక్కెన్

Wednesday, March 24, 2021

రావణుని బంటువయితివి రామచంద్ర!

తే.గీ.// 

షోకు కోసము సిగరెట్టు పీకలూది
ఆపుకోలేక ఇప్పుడీ యాతనేల
లోకులను చంపు సిగరెట్టనే కలియుగ
రావణుని బంటువయితివి రామచంద్ర! 

విద్యలేనివాడు వింత పశువు

ఆ.వె: 

వేడిగిన్నె చురక వాడిగా తగలగా,
వెర్రికేక పెట్టె గొర్రెలాగ,
పప్పు చేయబోవ, పలుచగా తేలగా,
ఓండ్ర పెట్టెనతడు నోర్వలేక,
పాకమువలెనున్న శాకముందినలేక,
రంకె వేసెనయ్య రంగచారి,
వంట చేసిపెట్ట యింట యిల్లాలు ' శ్రీ,
విద్య ' లేని, వాడు, వింత పశువు!!!,

 దొరల సాని ఎటుల దొరసాని అయ్యనో

సీ// దొరల సాని ఎటుల దొరసాని అయ్యనో, తెలియజేతు నిపుడు తెలుసుకొనుము
ఎంతవారైనను కాంతదాసులుకార, తరుణి వలపుతోడ దరికిచేర!
వగలు ఒలకబోసి, వయ్యారములుపోయి, సిగన పూలు తురిమి, సెంటు పూసి
దొరల సాని అటుల దొరసాని అయ్యెరో, చెంత చేరి అతని చెలిమి చేసి!

కోతితొ పెండ్లి కుదిరెనని కోమలి మురిసెన్ 

కం//

జీతము దండిగ వచ్చెడి
కోతితొ పెండ్లి కుదిరెనని కోమలి మురిసెన్
చేతిలొ డబ్బులు కలిగిన
రోతగ మొహమున్నను సరిలెమ్మని తలచెన్

Sunday, March 21, 2021

సూర్యండుదయించె రాత్రి శుభములు గలుగన్

కం//
భార్యామణితో గనె నా
చార్యులు డే-నైటు మ్యాచి సాయంకాలం
సూర్యుడు కృంగగ విద్యుత్
సూర్యండుదయించె రాత్రి శుభములు గలుగన్

విద్యను వలదన్నవాడు విజ్ఞుండిలలో

కం.||

ఉద్యోగిగ కాజాలడు

విద్యను వలదన్నవాడు; విజ్ఞుండిలలో

ఉద్యుక్తతతో విద్యను

అధ్యయనముఁ జేసి తాను ఆరాధ్యుడగున్

 తల్లి పెనుదయ్యమగుచుండు తనయులకును

తే.గీ.||
తనయులకు తెలియఁజేయక తండ్రి యొకడు
అప్పులను చేసి బ్రతికెను గొప్పగాను
తండ్రి అప్పు తీర్చుడనుచు తరుము ‘పైడి
తల్లి' పెనుదయ్యమగుచుండు తనయులకును

Saturday, March 20, 2021

 అర్జునుడొక పిడుగు పడగ అమ్మో అనెనే

కం||

ఆర్జీ పెట్టెద స్వామీ!

దర్జాగా ఇట్టులనుట తగునా మీకున్?

వర్జితమదిగద, ఎప్పుడు

అర్జునుడొక పిడుగు పడగ అమ్మో అనెనే?

 'మతమును వీడిన మనుజుడె మాన్యు౦డిలలో!'

కం//

మితిమీరి సురను త్రాగుట,
అతిగా తా చీట్లపేక ఆడుట, రెండున్,
సతతము గొను దుర్జన స
మ్మతమును - వీడిన మనుజుడె మాన్యుండిలలో
(11/30/2012)


Friday, March 19, 2021

 సమస్య: ఉండెకన్యాకుమారియె ఉత్తరమున

తే.గీ||

బుద్ధగయఁ జూడ శ్రీలంక బౌద్ధుఁడొకడు

భరత దేశముఁ జేరగ  బయలుదేరి

నౌకలో పయనింపఁ యా నావికునకు

ఉండెకన్యాకుమారియె ఉత్తరమున

(10/30/2012)