Sunday, November 9, 2008

అమెరికా పద్యాలు

సిలికానాంధ్రా వారి సర్వధారీ నామ సంవత్సర ఉగాది సంబరాలలో జరిగిన కవి సమ్మేళనంలో నేను చదివిన పద్యాలివి. హాస్యం కోసం కొంత, ప్రాసకోసం కొంత, ముఖ్యంగా భాషాజ్ఞానలోపం వలన, అనుకున్న కంటే ఎక్కువగా ఆంగ్లపదాలు వాడవలసి వచ్చింది.

గురు స్మరణ: కవిత్వం చెప్పేముందు చదువు నేర్పిన గురువులను స్మరించడం మన భారతీయుల ఆనవాయితి.
కం//
దుంపలబడిలో గురువులు
చెంపలు వాయించి అపుడు చెప్పిన చదువే
పంపెను కదరా మనలను
గుంపులుగా చేరి ఇచట గోష్ఠులు చేయన్

(నేపథ్యం: అమెరికా వచ్చిన ఒక బామ్మగారు భారత దేశంలో ఉన్న తన మనమరాలికి ఇక్కడ తను చూచిన విషయాలు వివరిస్తూ వ్రాసిన ఉత్తరమిది.)

అమ్మీ,

ఇక్కడకు క్షేమంగా చేరి ఇంచుమించుగా నెల్లాళ్ళయింది. అమెరికా వచ్చిన తరువాత నీకు ఉత్తరం రాస్తానన్నాను కదా. ఇవిగో ఇక్కడి విశేషాలు.

కం//
వచ్చిన క్రొత్తన యన్నియు
చచ్చెడి తికమకగ నుండు, చాలాకాలం
స్విచ్చి పనితీరు తెలియదు,
వచ్చుఁ బగలు నిద్ర, రాత్రి వచ్చును జెట్‌లాగ్!

కం//
దూరము నిక్కడ మనుజులు
కారున పయనింప బట్టు ఘడియల గొలుతుర్
ఊరుకి నూరుకి దూరము
ఆరున్నర గంటలెటుల నడగకె భామా!!

కం//
నిక్కరును షార్టు యందురు,
గెక్కో యగునిచట బల్లి, గేసగు పెట్రోల్,
ట్రక్కనెదరు లారీనిట,
చెక్కని బిల్లుని పిలుతురు, చెప్పెద వినుమా!

ఆ.వె//
బెండకాయ మరియు బీరకాయలె గాక
దొండకాయ కూడ దొరకునిచట,
చక్కగనవియుండ సాలడు పేరున
ఆకులను దినెదరు మేకలాగ!!

కం//
పచ్చడి లేకున్న జిహ్వ
చచ్చునులే తినగ నిచటి చప్పటి కూరల్,
నచ్చదు వీరికి కారం,
వచ్చునె రుచి మిరప లేక వంటల కెపుడున్?!!

కం//
వీకెండున యిల్లువదలి
పోకుండా యుండలేరు, బుర్రకు బోరింగ్
కాకుండా హైకింగని
ఏ కొండో ఎక్కివత్తురిచ్చటి మనుజుల్!!

కం//
తూకం చూసుకు బాబోయ్
హౌకం నేనింతబరువు యయినా ననుచున్
వాకింగ్ చేసెదరాపై
బైకింగే పగలు రాత్రి, బరువది తగ్గన్!!

బామ్మ ఎప్పుడూ వంకలే యెంచుతుందనుకోకు. ఇక్కడ కొన్ని బాగున్న విషయాలివిగో.

కం//
ఎవ్వరినెవ్వరు జూచిన
రువ్వెదరొక చిన్న నవ్వు, రూలది, యేమీ
యవ్వారమనుచుఁ దలపక
నవ్వగవలె నీవుగూడ, నాకది నచ్చెన్!!

కం//
పుచ్చుల వుండవు కూరన,
వచ్చునులే వేడినీళ్ళు పంపున యెపుడున్.
బొచ్చున్న కుక్కలధికము.
మచ్చుకకుఁ గానరావు మశకము లిచటన్!!

చెప్పాలంటే యింకా చాలా విషయాలున్నాయి. మిగిలిన విశేషాలు తరువాత ఉత్తరంలో రాస్తాను.

దీవెనలతో,
నీ బామ్మ