Tuesday, July 6, 2021

కాఫీమతల్లి దండకం

 

కాఫి కప్పూ, భలే వేడి కప్పూ, ప్రభాతాన నన్లేపు పానీయముం గల్గు కప్పూ నినున్ త్రాగకున్నన్ జగంబందు నేకార్యముల్ సాధ్యమే గావటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్ నామ సంకీర్తనల్ చేసి కప్పు సేవించి నీ రూపు వర్ణింప నీ మీద నే దండకంబొక్కటిం జేయ నూహించి నే వ్రాయ ప్రారంభమున్ జేసితిన్ గాని వేవేల రూపంబులై నీవులోకంబులో నుండ నిన్నెంచ నేనెంత వాడంగదే.


తొల్లి వైకుంఠమున్, పాల సంద్రమ్మునన్, శేష తల్పమ్మునందున్ మహావిష్ణువున్ హాయిగా నిద్రపోవంగ నాపైన లేవంగ తాబద్దకింపంగ లోకమ్మునన్ ఆలనా, పాలనా, పోషణా, రక్షణా లేక క్షోభించగా నప్డు భూదేవియున్, అక్క శ్రీదేవియున్, మూడులోకాల కల్యాణముంగోరి శ్రీవారికిన్ శక్తి తెచ్చేటి మార్గంబదేమంచు బ్రహ్మాదులన్ వేడగా వారు క్రొత్తైన బీజంబు సృష్టించి కాఫీయనే నామమున్నిచ్చి భూదేవికిన్ మరియు శ్రీదేవికిన్ గింజలన్ వేచి చూర్ణమ్ముగా చేసి వేడ్వేడి నీరందు వేయంగ వచ్చేడి పానీయమున్ గుడ్డలోనుంచి పోనించి కొంచెంబుగా చెక్కెరన్ వేసి త్రావించినన్ మంచి ఉత్తేజమున్ గల్గు నంచున్ వచింపంగ శ్రద్దాళియై విన్న శ్రీ దేవి యారీతి శ్రీవారికిన్ యీయగా లోక కళ్యాణమయ్యెంగదా!

నాటికిన్ నేటికిన్ భర్తకున్ శక్తి కల్పింపగా చిక్కనై, పల్చనై, వేడియై, చల్లనై, తీపియై, చప్పనై, తెల్లనై, నల్లనై, పెక్కు రూపంబులై, లోకసంక్షేమకార్యార్ధివై యెంతొ శ్రేయమ్ము, సౌఖ్యమ్ము హాయిన్నొసంగేటి కాఫీ, చిదానంద దాయీనేకాను రూపంబులౌ నిన్ను వర్ణింప నావల్లనౌనే? ప్రియే! నీకు సాటేది లేదీ బువిన్. మా శిరోభారాది రోగమ్ములన్ ద్రుంచి స్వాస్థ్యమ్మున్ శక్తినిన్ మాకొసంగంగ నీవే తగున్.

నీ దాస దాసుండనై నీదు భక్తుండనై నిన్నునే కొల్చెదన్ నీ కటాక్షంబునున్ జూపి మాకెల్ల ఉత్తేజమున్ తెమ్ము. కాఫీమ తల్లీ నమస్తే, నమస్తే, నమస్తే నమః!

Monday, July 5, 2021

మూడుకు నారును గలుపగ మూడే వచ్చెన్

 సమస్య:-

"మూడుకు నారును గలుపగ మూడే వచ్చెన్"


కం.

కూడికలు నేర్చు బుడతడు

చూడగ లేదాయె కొమ్ము సున్నకు పైనన్

వాడారు సున్నయనుకొని

మూడుకు నారును గలుపగ మూడే వచ్చెన్!


కం.

కూడిక తప్పుర భడవా!

మూడుకు నారును కలుపగ మూడెట్లన్నన్

వాడారు కొమ్ము తుడిచెను

మూడుకు నారును గలుపగ మూడే వచ్చెన్!