Monday, June 1, 2009

కవిత్వం ఎలా ఉండకూడదు..

చాలా మంది కవులు కవిత్వం ఎలాఉండాలి అని నిర్వచించారు గాని, ఎలా ఉండకూడదో చెప్పలేదు. కవిత్వం ఎలాఉండాలని పెద్దన చెప్పిన పద్యం అందరకూ తెలిసిందే. పెద్దన పద్యం చెప్పగానే చమత్కారంగా రామభధ్ర కవి ఈ క్రింది పద్యం చెప్పాడట. ఇంచుమించుగా ఒక ఏడాది క్రితం మా ఊళ్ళో జరిగిన 'అమెరికా సాహితీ సదస్సు'లో రేవూరి పద్మనాభరావుగారు కవిత్వంలో చమత్కారం గురించి ప్రసంగిస్తూ ఈ విషయం చెప్పారు. తరువాత ఆయన చెప్పగా నేను వ్రాసుకున్న కాగితం తప్పిపోయి నిన్ననే దొరికింది. అయితే అందులో కొన్ని అక్షరాలు చెరిగిపోయి సరిగా కనిపించడం లేదు. ముఖ్యంగా అయిదవపాదంలో కొన్ని అక్షరాలు తెలియడంలేదు. ఈ పద్యం తెలిసిన వాళ్ళు చెప్పగలరు.



నెరిచెడుపాడు భావములు, నిద్దురపోయెడు కుంభకర్ణుగు
ర్గురురురురావముల్, మనసు కోరినవాడు నిరాకరింప సుం
దరి మరి వెక్కివెక్కి విలపింపగ వచ్చెడి పిచ్చికూతలం
దిరుకు కెకెక్కెకె ధ్వనులు, ఇత్తడి చెంబున రాళ్ళు పోసి గి
ర్గిరగిర ద్రిప్పనుప్ప ????, గాడిదమూకలు కొల్వుదీర్చి సుం
దరముగ గొంతు విప్పి సరదాపడి రాగము లాలపించు, బం
డరములు రుబ్బు పొత్తరము నానిన గారెల పొట్టు ఇట్టు న
ట్టొరసి నిరంతరంబు గరరో గరరోయని చేయు శబ్దముల్,
తిరముగ నిల్ప కావ్య సరళిన్ రచియింపగరాదు సత్కవుల్

2 comments:

Kathi Mahesh Kumar said...

కవిత్వం ఇలా మాత్రం ఖచ్చితంగా ఉండకూడదు. పదాల్ని విరిచేస్తే ఎలా? ఎంత ఛందస్సుకోసమైతే మాత్రం పదాల్ని విరిచేస్తారా!!!

పుష్యం said...

మహేష్ గారు,
పద్యాలలో ఒక పదం రెండు పాదాల మధ్య విరవడం సర్వ సాధారణం. వ్రాయడానికి సులభంగా ఉంటుందని పదాలు విరిచి వ్రాస్తాము కానీ, అలా ఉన్నంత్రమాత్రాన దానిని చదివినప్పుడు ఆ రెండు అక్షరాల మధ్య విరామం ఉండదు. గమనించి చూస్తే తప్ప, పదం ఎక్కడ విరిగిందో పద్యం చదువుతున్నప్పుడు తెలీదు. అందువలన అలా పదాలను విరవడంవలన ఎటువంటి నష్టమూలేదు. పూర్వకాలంలో అచ్చు యంత్రాలు లేకపోవడం వలన, కావ్యాలన్ని శ్రవ్య కావ్యాలుగా ఉండేవి. వాటికి ఒక చక్కని నడకని, తూగుని ఇచ్చి, గుర్తుంచుకోవడానికి సులభంగా ఉండడం కోసం ఛంధస్సు వాడేవారుతప్ప, శాస్త్రం పేరుతో పదాలను విరిచేయడం కోసం కాదు. కావాలంటే ఈ పద్యంలోని పాదాలనన్నిటినీ ఒకే వరసలో వ్రాసి చదివి చూడండి. మీకే అర్ధం అవుతుంది.