Sunday, March 29, 2009

ఆవకాయ - పద్యాలు

కాలిఫోర్నియాలోని సిలికాన్‌వేలీలో మార్చి 28న సిలికానాంధ్రా వారి శ్రీ విరోధీనామ సంవత్సర ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. దానిలో భాగంగా జరిగిన కవి సమ్మేళనములో నేను చదివిన పద్యాలు.


కం//
శ్రేష్టంబిది పచ్చళ్ళన,
టేష్టున ఇది మొదటనుండు డెఫినెట్ గానూ,
ఇష్టముగ ఆవకాయను
సుష్టుగ తిని దొర్లినంత సుఖమది కలదే!


(ఈ పై పద్యం లోని ఆఖరి రెండు పాదాలూ, కవి మిత్రులు 'ఆత్రేయ' గారి అనుమతితో వారి ఒక పద్యమునుంచి 'లేపిన'వి.)


కం//
ఊరిన ముక్కను కొరకగ,
ఔరా! అది ఎంత రుచిని అందించునయా,
కూరిమితొ నాల్గు ముక్కలు
నోరారా తినని నోరు నోరవ్వదుపో!

కం//
బెల్లము వేసిన మధురము,
పల్లీనూనెను కలపగ పచ్చడి మధురం,
వెల్లుల్లి వేయ మధురము,
పుల్లని మామిడితొ చేయ ముక్కది మధురం!!


ఈ ఆవకాయలోని ముక్కకి చాలా పేర్లు ఉన్నాయి:

కం//
చెక్కందురు, డిప్పందురు,
ముక్కందురు కొంతమంది మురిపెము తోడన్.
డొక్కందురు, మామిడి దిది
పిక్కందురు దీనికన్ని పేర్లున్నవయా!


ఆవకాయ ఉపయోగాలు:

కం//
ఉదయమె బ్రెడ్డున జాముకు
బదులుగ ఇదివాడిచూడు, బ్రహ్మాండములే,
అదియేమి మహిమొ తెలియదు,
పదునుగ నీ బుర్ర అపుడు పనిచేయునయా!


కం//
ఇందువల దందు బాగని
సందేహము వలదు; ఊట సర్వ రుచిహరం
బెందెందు కలపి చూసిన,
అందందే రుచిగనుండు, అద్భుత రీతిన్!


ఆవకాయ అవతరణ:

కం//
“చప్పటి దుంపలు తినుచును,
తిప్పలు పడుచుంటిమయ్య, దేవా, దయతో
గొప్పగు మార్గం బొక్కటి
చెప్పుము మా నాల్కలొక్క చింతలు తీర్పన్”

అంటూ,

కం//
ముక్కోటి దేవులందరు
మ్రొక్కగ తా జిహ్వలేప సృష్టించెనయా
చక్కనిది ఆవకాయన
ముక్క తినని వాడు కొండముచ్చై పుట్టున్!!


కం//
చారెరుగనివాడును, గో
దారిన తా నొక్కమారు తడవని వాడున్,
కూరిమిన ఆవకాయను
ఆరారగ తిననివాడు, ఆంధ్రుడు కాడోయ్!

7 comments:

జిగురు సత్యనారాయణ said...

పుష్యం గారు,
బాగుంది. చివరి పద్యము "చారెరుగనివాడును...." - బ్రహ్మాండం.
"ముక్క తినని వాడు కొండముచ్చై పుట్టున్" - బాగుంది. డార్విన్ మనుషులంతా కోతుల నుండి పుట్టారంటే, మీరు ఆవకాయ తినకపోతే మనుషులంతా కొండ ముచ్చులవుతారంటారు. బాగు బాగు..

పుష్యం said...

సత్యనారయన గారు,

నెనరులండి.

"ముక్కతినని వాడు కొండ ముచ్చైపుట్టున్" అన్నది కన్యాశుల్కంలో గిరీశం చెప్పిన
'పొగత్రాగని వాడు దున్నపోతై పుట్టున్' కి పేరడీ :-)

Anonymous said...

మీ కంద పద్యాలు మహా ఘాటుగా వున్నాయి.
ఉగాది పూటా "కందా"వకాయన్నమాట.

ఎలాగయితేనేం పుష్యమందిరంలో శ్యామసుందరుణ్ణి కనుక్కున్నాం...

బ్రహ్మానందం

పుష్యం said...

బ్రహ్మానందం గారూ,
Anonymous వ్యాఖ్యలో మీ పేరుంచారు, గమనించారో లేదో... :-)

కం//
చెందును మీకే బ్రహ్మా
నందము గారూ ఇలా అనామకుడనుచున్
అందున మీ పేరుంచుచు
చిందించిరి హాస్యమికడ చిలిపిగ తమరున్ :-)

రాఘవ said...

ఆవకాయపైన నాటవెలదిఁ గాక
కందపునవకంపు విందు వెట్టి
యావకాయరుచిని నందించినారుగా!
భళి రసాలకందపద్యరుచులు!

నేనూ ఒకప్పుడు ఆవకాయపై పద్యాలు వ్రాసాను కానీ ప్రచురించలేదు. అది గుర్తొచ్చిందండీ ఇవి చదివి. బావున్నై.

చిఱు అనుమానం. ఊట సర్వ రుచిహరం? సర్వరుచికరమని చెప్పాలనుకున్నారనుకుంటాను?!

పుష్యం said...

రాఘవా,

ఆవకాయ మీద మీరు పద్యాలు వ్రాసి ప్రచురించకపోవడం అన్యాయం. త్వరలో ప్రచురించండి.
ఆవకాయ ఎన్నిసార్లు తిన్నా మొహమ్మొత్తదు :-)

మొదట ఊట కాకరకాయలాంటి రుచులను కూడ హరించ గలదు అన్న దృష్టితో రుచిహరం అని మొదలు పెట్టాను. కానీ సర్వ రుచికరం అన్న విధంగా పద్యం వచ్చింది. త్వరగా వ్రాస్తున్న గొడవలో సవరించడం మరచాను. తప్పు పట్టుకున్నందుకు మీకు ఇవాళ రెండు extra ఆవకాయ ముక్కలు :-)

జ్యోతి said...

ఇది అన్యాయం శ్యామ్ గారు, ఉగాదికే ఆవకాయ పెట్టేస్తే ఎలా.. ఇంకా 40 రోజులుంది ఆవకాయ పెట్టడానికి, మీరేమో పద్యాలతో ఆవకాయ గుర్తుచేసి ఇబ్బంది పెట్టేసారు, నేను మాత్రం పప్పులోకి తెచ్చిన మామిడికాయలతో చిన్న గిన్నెడు ఆవకాయ పెట్టేసి తినేసా రాత్రి.. ఇక మీరు రాసుకోండి ఎన్ని ఆవకాయ పద్యాలైనా. మిగతా పచ్చళ్లు కూడ జత చేయండి మరి. సంతోషిస్తాం...