Wednesday, July 22, 2009

పాత మిత్రులు -- పద్యాలు

పొద్దు పత్రికవారు విరోధినామ సంవత్సర ఉగాది సంధర్భంగా జరిపిన అంతర్జాల కవిసమ్మేళనంలో వర్ణన అంశం క్రింద ఇద్దరు పాత మిత్రులు చాలాకాలం తరువాత కలిస్తే ఎలాఉంటుందో వర్ణించమన్నారు. దానికి నేను చేసిన ప్రయత్నం.

చాలా కాలం తరవాత పాత మిత్రుడ్ని కలుసుకున్న ఒక సాయంకాలం.

తలుపుతీసి ఆనందంగా,

కం//
"ఎన్నాళ్ళయ్యెను చూడక;
ఇన్నాళ్ళకు కలసినావు, ఏమయ్యావోయ్?
చిన్నప్పుడు కలవడమే,
ఎన్నోమారులు తలచితి, ఈవిడ నడుగోయ్!!"

అంటూ పరామర్శలయిన తరువాత,

కం//
వేళాకోళము లాడుతు,
ఖాళీ బుర్రను తడుముతు, కబురులు చెబుతూ,
భోళా నవ్వులు నవ్వుతు,
గోళీలాడిన దినములె గొప్పవి అనుచున్.

కం//
బొండాం శ్రీనుని తలచిరి,
గుండే ఎల్లప్పుడుండు గుర్నాధాన్నీ,
కండలు తిరిగిన బాలిక
ఆండాళును కూడ తలచి రానందంగా.

కం//
ఆడిన సినిమా లన్నియు
చూడ చదువొదలి సెకెండు షోలకు వెళుతూ
తోడగు దొంగల మాదిరి
గోడలు దూకిన దినములు గుర్తుకు తెస్తూ

కం//
“ఫైటంటే కాంతారావ్,
పాటంటే ఘంటసాల, బాగా ఫేమస్
షాటంటే ఎన్.టీ.ఆర్,
ఆటంటే జ్యోతిలక్ష్మి, ఆరోజుల్లో”

అంటూ పాత రోజులను తలచు కున్నారు.

కం//
ఇల్లాలిచ్చిన ప్లేటున
పల్లీలను నోటవేసి పటపట తినుచున్,
మెల్లగ సాయంత్రంబున
సిల్లీగా జోకులేస్తు, చీకటిదాకా…

మిత్రుడితో గడపి, ఆపై

కం//
"మళ్ళీ కలవాలయ్యా.
ఊళ్ళోనే ఉండి కూడ ఊసుల కోసం,
వాళ్ళూవీళ్ళెందుకు. మన
పెళ్ళాలిరువురును మంచి ఫ్రెండ్సయ్యారోయ్"

అంటూ సాగనంపాడు..


(పైన ఉన్న "ఫైటంటే" పద్యం సర్వ-గురు కందం. కందం నియమాల ప్రకారం 6, 14 గణాలలో తప్ప మిగిలినవన్నీ గురువులే. దీనిని కుఱచ కందం అని కూడా అంటారు)

8 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

భలే ఉన్నాయండీ మీ పద్యాలు!!

దైవానిక said...

చాలా బాగున్నాయి మీ పద్యాలు. సరళమైన భాషతో, అందంగా, నా ఫేవరెట్ కందాలు చాలా బాగా వ్రాసారు.

చింతా రామ కృష్ణా రావు. said...
This comment has been removed by the author.
చింతా రామ కృష్ణా రావు. said...
This comment has been removed by the author.
చింతా రామ కృష్ణా రావు. said...

పుష్య రాగము గాంచితి. పుణ్య పురుష!
మైత్రి కెనలేని భావంబు మహితముగను
వ్రాసి యుండిరి. చూచితి . వాసి గొలుప
సూచనలుకొన్ని చేసితి చూడ మనవి.
కం//
"ఎన్నాళ్ళయ్యెనురా చూడక;
ఇన్నాళ్ళకు కలసినావు, ఏమయ్యావోయ్?
చిన్నప్పుడు కలవడమే,
ఎన్నోసార్లు తలచితి, ఈవిడ నడుగోయ్!!"

పై పద్యం మొదటిపాదం{లో రా తీసివేసి}
నాల్గవ పాదం{లో తలచితిని అని సరిచెయ్యాలి}ఘణాలు సరిచూసుకోవాలేమో చూడండి.


కం//
వేళాకోళము లాడుతు,
ఖాళీ బుర్రను తడుముతు, కబురులు చెబుతూ,
భోళా నవ్వులు నవ్వుతు,
గోళీలాడిన దినములె గొప్పవి అనుచున్.

కం//
బొండాం శ్రీనుని తలచిరి,
గుండుతొ ఎల్లప్పుడుండు గుర్నాధాన్నీ,
కండలు తిరిగిన బాలిక
ఆండాళును కూడ తలచి రానందంగా.

ఈ పద్యం రెందవ పాదంలోనున్న తృతీయా విభక్తి ప్రత్యయం తో నిత్య గురువు. కాన గుండే అని గుండుతొ అనే దానికి బదులుగా వ్రాస్తే యోగ్యంగా ఉంటుందేమో ఆలో చించండి.

కం//
ఆడిన సినిమా లన్నియు
చూడ చదువొదలి సెకెండు షోలకు వెళుతూ
తోడగు దొంగల మాదిరి
గోడలు దూకిన రోజులు గుర్తుకు తెస్తూ

నాల్గవ పాదంలో మూడవ గణం " నల - లేదా - జ " తప్పక ఉండాలి.కాన భ గణం పనికి రాదేమో ఆలోచించండి. రోజులు అనే బదులు దినాలు అని వ్రాస్తే బాగుంటుందేమో అనిపిస్తోంది. గమనించండి.

కం//
“ఫైటంటే కాంతారావ్,
పాటంటే ఘంటసాల, బాగా ఫేమస్
షాటంటే ఎన్.టీ.ఆర్,
ఆటంటే జ్యోతిలక్ష్మి, ఆరోజుల్లో”

ఇది చాలా బాగుంది.

కం//
ఇల్లాలిచ్చిన ప్లేటులొ
పల్లీలను నోటవేసి పటపట తినుచున్,
మెల్లగ సాయంత్రంబున
సిల్లీగా జోకులేస్తు, చీకటిదాకా…

ఈ పద్యంలో ప్లేటులొ అనే దానిలోని షష్టీ విభక్తి ప్రత్యయమగు లో నిత్య గురువు. కావున ప్లేటులొ అనే కన్నా ప్లేట్లో అని అంటే సరిపోతుందేమో చూడ మనవి.

కం//
"మళ్ళీ కలవాలయ్యా.
ఊళ్ళోనే ఉండి కూడ ఊసుల కోసం,
వాళ్ళూవీళ్ళెందుకు. మన
పెళ్ళాలిద్దరుకూడా ఫ్రెండ్సయ్యారోయ్"

ఈ పద్యంలో నాల్గవ పాదంలో మూడవ గణం విషయంలో కూడ అని గగ సరిపోదనుకొంటాను. పెళ్ళాలూ కలిసి పోయి అంటే బాగుంటుందేమో ననిపిస్తోంది. మీరు మీకుగా ఆలోచించి సరిచేస్తే బాగుంటాయనిపిస్తే సరిచేయ మనవి.

పుష్యం said...

@మందాకిని, @దైవానిక,
పద్యాలు నచ్చి నందుకు ధన్యవాదములు.

రామకృష్ణ రావు గారికి,

కం//
చింతా వారికి ప్రణతులు.
సాంతంగా చదివి నాకు చక్కని మార్పుల్
తంతిగ పంపిరి. నెనరులు.
అంతా నా తప్పు గాదు, ఆర్యా, వినుడీ!!

ఆ.వె//
తప్పులన్ని దిద్దినొప్పు ప్రతిని మాని
చిత్తు ప్రతిని నేను కత్తిరించి
తెలియకుండ బ్లాగు తెరలపై వేయగా
తప్పులెన్నొ దొర్లె దాని వలన

గణాలు సవరించిన file బదులు పాత fileలో నుండి కత్తిరించి-అతికించడం (cut and paste) మూలంగా గణాలలో చాలా తప్పులు దొర్లినవి. క్షంతవ్యుడను. అయితే 'గుండుతొ' మరియు 'ప్లేటులొ' తప్పులు మటుకు నేను తెలియక చేసినవి. తప్పులు చూపి, సవరణలు సూచించినందులకు ధన్యవాదములు.

చంద్ర మోహన్ said...

చాలా బాగున్నాయి పద్యాలు! మంచి ధార, వేగం ఉన్నాయి కందాల్లో.

ఆత్రేయ కొండూరు said...

చాలా బాగుందండీ
మీలా కందం వడకగ మీకే చెల్లున్‌
దొర్లే ఆంగ్లం కూడా
మల్లెల్లానే తగిలెను మత్తుల్జల్లన్‌