Monday, March 22, 2010

చమత్కార వికృతులు

అమెరికాలోని కాలిఫోర్నియా బే-ప్రాంతంలో సిలికానాంధ్రా వారు నిన్న వికృతినామ యుగాది సంబరం జరిపారు (ఇక్కడ అన్ని పండుగలు modulo weekendన జరుగుతాయి :-) . అందులో జరగిన కవిసమ్మేళనంలో నేను చదివిన పద్యాలివి. చమత్కారం కోసమని మనము చిన్నప్పుడు చదువుకున్న కొన్ని పద్యాలకు వ్రాసిన పేరడీలు. ఈ పేరడీలకు కారణమనదగ్గది పొద్దు పత్రికవారి ఉగాది కవిసమ్మేళనంలో ఇచ్చిన 'లావొక్కింతయు లేదు' తో ప్రారంభించి పద్యం వ్రాయమని ఇచ్చిన సమస్య.


'టీ కొట్టు నాయరు':

కం//
ఇందుగల డందు లేడని
సందేహము వలదు మీకు, చక్కగ నాయర్
ఎందెందు వెదకి చూచిన
అందే టీ కొట్టు పెట్టు, అద్భుత రీతిన్!!

-----------

ఈ రోజుల్లో ఎవరు డాబుగా మాట్లాడతాడో వాడే పైకి వస్తునాడు.

ఆ.వె//
అల్పుడెపుడు పల్కు ఆడంబరముగాను
అందువలనె వాడు అధికుడౌను
అరచునట్టి శునక మావులు కాయదా?
విశ్వదాభిరామ వినర శ్యామ!!


-------------

శతకకారుడు చక్కని పద్యమొకటుంటే చాలన్నాడు. దానినే ‘అల్లుడి గొంతెమ్మ కోర్కెలు’ కి అన్వయించుకుంటే:

ఆ.వె//
"నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు.
పట్టుపంచెలారు, వాచి ఒకటి.
తిండి తినగ నాకు వెండి కంచము చాలు.
చక్కనైన కారు చాలునాకు"

---------------

కం//
సిరిగల వానికి చెల్లును
తరుణులు పదియారు వేలు తగ పెండ్లాడన్
చిరు మానవునకు కుదరదు
'ఒరు’ పెండ్లామే సరిపడు ఓరిమి పోవన్!

-----------------------

గజేంద్ర మోక్షంలో పోతన 'లావొక్కింతయు లేదు' అని ఒక శార్ధూలము వ్రాశాడు. దానిని కొద్దిగా మారిస్తే:

ఒక తల్లి తనకు నచ్చిన అమ్మాయిని చూడమని కొడుకునుద్దేసించి:

కం//
“లావొక్కింతయు లేదుర,
జీవితమున నీకుమంచి చేదోడగురా.
పావని చక్కని పిల్లర,
నీవామెను చూడకున్న నేనొప్పనురా!!”

--------------------

ఇంట్లో సంగీతం నేర్చుకునే పిల్లలున్న వాళ్ళందరికీ తెలిసిన విషయం:

ఆ.వె//
అనగననగ రాగ మతిశయిల్లుచునుండు,
వినగవినగ చెవులు బిళ్ళ కట్టు.
పాట రాని పిల్ల పగలు రాత్రెరుగదోయ్,
విశ్వదాభిరామ వినర శ్యామ!!

౨౯-మార్చ్-౨౦౧౦
మా భా.భా.సం. సభ్యులు, పిల్ల బాధకంటే ఇల్లాలి పాట బాధ ఎక్కువుందంటే, వారికోసం మూడో పాదం మార్చాను :-)

.వె//
అనగననగ రాగ మతిశయిల్లుచునుండు,
వినగవినగ చెవులు బిళ్ళ కట్టు.
పాటరాని భార్య బాధ బ్రహ్మెరుగునా?
విశ్వదాభిరామ వినర శ్యామ!!

(అనుకోకుండా వ్రాసినా, ఇక్కడ చిన్న చమత్కారం దొర్లింది: బ్రహ్మ భార్య 'సంగీత' సరస్వతి కదా!!)
---------------------------


అమెరికాలో ఉండడం మూలంగా బంధువులు వచ్చే ప్రమాదం లేదుగాని, ఒక్క డాలరు సంపాదించినా Tax వాడు మటుకు తప్పక వస్తాడు. రాబోవు April 15th మాకు Tax Day. దానిని దృష్టిలో పెట్టుకుని:

కం//
ఎప్పుడు సంపద కలగిన
అప్పుడె ఆదాయపన్ను ఆడిటరొచ్చున్.
కుప్పలుగ చెప్పులున్నచొ
తప్పక శునకంబు వచ్చు, తథ్యము శ్యామా!!

పద్యాలు మీకు నచ్చుతాయని ఆశిస్తూ,
పుష్యం

11 comments:

Sriram said...

Enjoyed thoroughly....!

కొత్త పాళీ said...

"పాట రాని పిల్ల పగలు రాత్రెరుగదోయ్,"
This is absolutely the best!!

రవి said...

వావ్. ఉగాది రోజు దీపావళి ఔట్లు పేల్చారు!

కంది శంకరయ్య said...

హృద్యములు నీవు వ్రాసిన
పద్యమ్ముల పేరడీలు భళిభళి యని నే
నాద్యంత మరసి మెచ్చితి
చోద్యంబయె నాకు శ్యామసుందర! సుయశా!

అన్నట్టు ... కట్ట పంచెలు చాలు కట్టువారు .. అన్న చోట గణదోషం ఉంది. సరి చేయండి.

చదువరి said...

భలే బావున్నాయండి. చివరిది మరీను.

రాఘవ said...

అరచునట్టి శునక మావులు కాయదా? భలే!

పద్యాలన్నీ బాగున్నాయండీ. :)

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

చాలా బావున్నాయి.మరిన్ని రాయండి.

పుష్యం said...

@శ్రీరాం, @రవి, @రాఘవ, @చదువరి, @చెప్పుదెబ్బలు,
పద్యాలు నచ్చయని తెలిపినందుకు ధన్యవాదములు.

@శంకరయ్య,
గణదోషమును చూపిననందుకు నెనరులు. సవరించాను.

@కొత్తపాళి,
ఇప్పుడు భా.భా.సం. వాళ్ళ కోసం ఇంకొక పాదం కూడా వ్రాసాను. గమనించండి. :-)

పుష్యం

sathish said...

nice poems..

Srinivas Vadrevu said...

నమస్తే శ్యామసుందర్ గారు,
ఈ రోజు మీ "కాఫీమతల్లి" దండకం వినగానే మీ ఇతర కవితలన్నీ చదవాలని ఆసక్తి కలిగి, మీ బ్లాగు చూసాను. బహు చక్కని కవితలను పొందుపరిచారు.
I really liked the last padyam about tax day. Keep writing them. Very relaxing and inspiring as well to read them.

ధన్యవాదములు,
శ్రీనివాస్ వాడ్రేవు

Srinivas Vadrevu said...

నమస్తే శ్యామసుందర్ గారు,
ఈ రోజు మీ "కాఫీమతల్లి" దండకం వినగానే మీ ఇతర కవితలన్నీ చదవాలని ఆసక్తి కలిగి, మీ బ్లాగు చూసాను. బహు చక్కని కవితలను పొందుపరిచారు.
I really liked the last padyam about tax day. Keep writing them. Very relaxing and inspiring as well to read them.

ధన్యవాదములు,
శ్రీనివాస్ వాడ్రేవు