Monday, January 5, 2009

మత్తకోకిలలో ఛుకుఛుకు రైలు - పద్యం

చిన్నపిల్లల పాటలలో 'ఛుకుఛుకు రైలు వస్తోంది' అన్నపాట చాలమందికి తెలుసు. మొన్ననే మా అమ్మయికి ఆ పాట నేర్పిస్తుంటే దానిని ఛంధోభద్ధంగా వ్రాస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. లయబద్ధంగా ఉంటుందని మత్తకోకిలలో వ్రాయడానికి ప్రయత్నించాను (మత్తకోకిల పద్యాన్ని 'మత్తకోకిల-మత్తకోకిల-మత్తకోకిల-కోకిలా' అన్న లయతో చదివితే వినడానికి బావుంటుంది).

మూలం: (ఎవరు వ్రాసారో నాకు తెలియదు)

ఛుకుఛుకు రైలు వస్తోంది
పక్కకు పక్కకు జరగండి
ఆగినాక ఎక్కండి
జోజో పాపాయ్ ఏడవకు
లడ్డూ మిఠాయి తినిపిస్తా
చల్లని పాలు త్రాగిస్తా

నా ప్రయత్నం:

మ.కో//
ఛుక్కుఛుక్కని వచ్చుచున్నది జోరు రైలది చూడరా
పక్కపక్కకు నక్కి, ఆగిన బండి నీవపుడెక్కరా
గుక్క పెట్టకు, జోలపాడెద, గోల నీవిక చేయకే
చక్కనైన మిఠాయి తోడుగ చల్లపాలను ఇచ్చెదన్

4 comments:

ఆత్రేయ కొండూరు said...

చాలా బాగుందండీ మీ మత్త కోకిల

కాస్త సవిరించాను rythm కోసం. తప్పులుంటే మన్నించ గలరు. చందస్సు నాకు అంతగా తెలియదు.

ఛుక్కుఛుక్కని వచ్చుచున్నది బొగ్గు బండది చూడరా
పక్కపక్కకు నక్కి ముందుగ ఆగినప్పుడె ఎక్కరా
గుక్క పెట్టకు, జోలపాడెద, గోల చేయకు పాపడా
చక్కనైన మిఠాయి తోడుగ చల్లపాలను ఇచ్చెదన్

Unknown said...

రెండు పూరణలూ బాగున్నాయి.

పుష్యం said...

@ఆత్రేయ,

పద్యం నచ్చినందుకు ధన్యవాదాలు. మీ సవరణలో మొదటి రెండు పాదాలలో యతి తప్పింది. మూడొవపాదం సవరణ బాగుంది.

cbrao said...

మీ వేగు చిరునామా, టెలిఫోన్ సంఖ్యలతో నాకు ఒక ఉత్తరం రాయగలరా?

cbraoin at gmail.com
San Jose, CA