Saturday, May 14, 2016

గోంగూరావతరణము

గోంగూరావతరణము
(3/30/2014)


( క్రింది పద్యాలలోని కొన్ని భావనలకు ప్రేరణ ఇంతకు పూర్వము కవి మిత్రులతో, ముఖ్యంగా లంక గిరిధర్ మరియు సనత్ శ్రీపతి లతో, జరిగిన ఒక సాహితీ చర్చ. అందులకు వారికి నేను పత్రికాముఖముగా నా కృతజ్ఞతలు తెలియ జేసుకుంటున్నాను)
 
కం//
ఉత్తమమౌ పచ్చడిగా
కుత్తుకకున్ సుఖముఁగూర్చు గోంగూర, భళా!
చిత్తమలరంగ యిదిఁ దిని
మత్తుగనిదరోవు సుఖము మహిలో గలదే!

సీ//
శాక పాకములందు శాకాంబరీ దేవి
                                దీవెనల్ పొందిన తెలుగు కూర
పంచశరుని యొక్క పంచాస్త్రములఁ బోలు
                                పంచాగ్రములుగల పచ్చ కూర
'దేవాంతకుడు' యందు, ధీటుగా N.T.R
                                గొప్పగా పొగిడిన గోగు కూర
ఆకుకూరలెపుడు  ఆరోగ్యమున్ బెంచు
                                యనుచు వైద్యుడొసగు  ఆకుకూర
.వె//
పప్పు కూరయందు పచ్చళ్ళయందున
పులుపు నొసగు నిదియె పుంటి కూర
ఆంధ్రులనగ మనము అదృష్టవంతులం
బనుచు చాటి చెప్పు ఆకు కూర.

.వె//
గోగు కూరదెచ్చి బాగుగా మగ్గించి
గరిట పోపు వేసి కమ్మగాను
రోట రుబ్బి దాని నీటుల్లిపాయతో
తినిన అమృతమునది తినిన యట్లె!

కం//
గరుడుడు కష్టములొందుట,
హరిపడతిగ వేషమేసి ఆడుట, కాకో
దరములు దర్భలు నాకుట,
తిరముగ గోంగూర రుచిని తెలియక సుమ్మీ!!

.
మత్స్యావతారనంతరము మునులందరు క్రొత్త ప్రదేశములో సరియైన తిండి కుదరక, ముఖ్యంగా నంజుడు లేక, విష్ణువునిలా ప్రార్ధించారు:

కం//
చప్పటి దుంపలు తినుచును
తిప్పలు పడుచుంటిమయ్య దేవా దయతో
గొప్పగు మార్గం బొక్కటి
చెప్పుము మా నాల్క లొక్క చింతలు తీర్పన్

అప్పుడు విష్ణువు, "సృష్ట్యారంభములో ఆవకాయ ఇచ్చానుగదా" అనెను. అప్పుడు మునులు స్వామికి మ్రొక్కి:

.వె//
"ఆవకాయఁ బెట్ట నైదు రోజులుఁ బట్టు
వేసవందుఁ దప్ప వీలుఁ గాదు
ఎల్లవేళలందు నింపుగా దొరికెడి
పచ్చడొసగు మయ్య పరమ పురుష!"

అన్నారు. అప్పుడు విష్ణువు గోంగూర విత్తనాలు సృష్టించి, మునులకిచ్చిఇట్లనెను:

కం//
ఎక్కడ పడితే అక్కడ
మిక్కుటముగ దొరకు మీకు, మేలును గూర్చున్
చక్కనిదౌ శాకము మీ
ఇక్కట్టులు తీర్చునట్టిదీ గోంగూరే!
  
కం//
గోంగూర వంటి బచ్చడి
గంగానది వంటి జలముఁ గలిగిన యేఱున్
చెంగావి వంటి రంగుయు
మంగాపతి వంటిదైవమవనిన గలవే!!

కం//
శతకముఁ జదవని వాడును
కుతుకముతో గోగు కూర కుడవని వాడున్
గతితప్పక సినిమాలను

అతిగా తాఁ జూడకున్న ఆంధ్రుడు కాడోయ్!

2 comments:

రాజేశ్వరి నేదునూరి said...

నమస్కారములు
పద్యాలు చాలా బాగున్నాయి శ్యాం సుందర్ గారు
సిలికానాంధ్ర 15వ వార్షి కోత్సవ గరికపాటి వారి అవధానంలో మీరు పాల్గొనడం ముదావహం .అభినందన మందారములు సెలవు

Anonymous said...

test