Monday, July 1, 2024

బఱ్ఱెకు నెదురుగ జేరకు

 కం.

బఱ్ఱెకు నెదురుగ జేరకు,
గుఱ్ఱమునకు వెనుకజేర కుండుము, గానీ
వెఱ్ఱిని నేదిశ జేరకు,
బుఱ్ఱకు తాఁ ముప్పుదెచ్చు, పుల్లెల శ్యామా! (Jan 27th, 2023)
(Never approach a bull from the front, a horse from the rear, or an idiot from any direction - Internet quote)


Saturday, April 20, 2024

క్రోధి నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనము

ఏప్రిల్ 12 2024 రోజున జరిగిన 'వీక్షణం' సాహితీ గవాక్షం వారి క్రోధి నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనములో నేను చదివిన పద్యాలు:


సీ//

రామచంద్రుడనెడి నామంబు గల్గియూ 

              పరవనితల వెంటఁ బరుగులిడరొ?

సావిత్రి యనిబిల్వ చక్కనౌ పేరుండి 

              భర్తను బాధించు పడతి లేదొ?

శాంతి యనెడి పేరు సార్ధక నామంబె, 

              కోపమెపుడు గల్గు కోమలికిని?

వీరభద్రుడనెడి పేరుదాల్చియుగూడ 

              నెమ్మదిగ మసలువా నిలనఁ గనమొ?

తే.గీ//

పేరుఁ దెల్పదు నెవ్వాని పేర్మి గుణము

క్రోధి నామమ్ము విని మీరు క్రుంగవలదు

ఆయురారోగ్యములనిచ్చి హాయి గూర్చి

కూర్మిఁ గాపాడుఁ జక్కగా  క్రోధి మనను!