Thursday, May 20, 2021

 జడ పంచకం

రచన: పుల్లెల శ్యామసుందర్


కం//

పిరుదులుఁ దాకెడి జడలే

సరియైనవి యనుట తప్పు, చక్కగ ఇంపౌ

విరులను తురిమినచో జడ

కురచైనను సొగసులీను, కుదురుగ శ్యామా!


కం//

నూనెలు పడిపడి పూసిన

జానెడు పొడుగున్న జడలు చకచక పెరగవ్

దీనికి మూలము జెనెటిక్స్

పోనీ యని తలచుటెపుడు పుణ్యము శ్యామా



కం//

చీరలుఁ గట్టెడి పడతికి

బారెడు జడ సొగసు నిచ్చు, ప్యాంటులుఁ దొడిగే

నారికి ‘పోనీ టైలే’

గ్యారెంటీగా పొసగును, గదరా శ్యామా!



కం//

అబ్బో జడ పొడుగనుచున్

తబ్బుబ్బై పెండ్లియాడి, తననెల జీతం

కొబ్బరినూనెకు మరి ‘తల

సబ్బు’లకే చాల కేడ్చె, సరసుడు శ్యామా!



కం//

సన్నని నడుముకుఁ దోడగు

మిన్నగు లావాటి జడయె, మేలుర రామా!

సన్నని జడకున్ దోడగు

గున్నేనుగు వంటి నడుము, గోలర శ్యామా!

Monday, April 5, 2021

 పందిని కౌగలించుకొని పంకజలోచన సంతసించెరో!


ఉ.

కొందరు హాస్యమాడ కడుకూరిమి తోడుతఁ బిల్తురాతనిన్

పందని, కారణంబడుగ ‘పంట దివాకరు’ నామధేయమే

సుందరి పెండ్లిచేసుకుని శోభనమందున ప్రేమమీర యా

‘పంది’ని కౌగలించుకొని పంకజలోచన సంతసించెరో!




Sunday, April 4, 2021

దత్తపది: వంగ, దోస, కాకర, కంద పదములను అన్యార్ధములతో వాడుతూ భారతదేశ స్వాతంత్ర్య సమరానికి సంభందించిన విషయముపై స్వేచ్ఛా ఛందస్సులో పద్యము వ్రాయాలి


కం||

మాటలు కాక రణమ్నున

తూటాలేసెఁ గెలువంగ దోసపు దొరలన్

మాటుండి వారి కందక 

ఆటల నాడించెను మన అల్లూరి, భళా!



 

తక్కువ డబ్బున్నవాడె ధనవంతుడిలన్పె


కం.

ఎక్కుగ కష్టములొందును

తక్కువ డబ్బున్నవాడె, ధనవంతుడిలన్

జక్కగ తాఁ రొక్కముతో

యిక్కట్లను పారద్రోలు నింపుగ శ్యామా!


 

Friday, April 2, 2021

 

రోహిణి కార్తెలో చలికి లోకులు బాధలనొందురెప్పుడున్


ఉ.

ఐహిక సౌఖ్యముల్ కొఱకు నాపని ఇంధన వాడకమ్ము చే

ఊహలకందనంతగను యుర్విన కాలము తారుమారగున్

ఆహిమకూటముల్ గరుగు, ఆగవు ఎండలు కార్తికమ్మునన్

రోహిణి కార్తెలో చలికి లోకులు బాధలనొందురెప్పుడున్

(ఇంధనకాలుష్యం మూలంగా ఋతువులు తారుమారవుతాయంటారు. ఆ దృష్టిలో పూరిమపబడింది)


Thursday, April 1, 2021

తలనొప్పిని దగ్గుమందు తగ్గించునిలన్ 

కం//

తలనొప్పికి వైద్యుడొక్కడు

ఫలితముకై నిత్యరోగి కిచ్చె బెనడ్రిల్

బలమగు నమ్మకముండిన

తలనొప్పిని దగ్గుమందు తగ్గించునిలన్

 సమస్య - సతిని విడచువాడె సజ్జనుండు

ఆ.వె||

పనుల కొరకుఁ దాను పరదేశములకేగ

ఊసులాడ మనుషులుండవలెను

యనుచు దలచి తనదు అత్తమామలవద్ద

సతిని విడచువాడె సజ్జనుండు