July 9th మా నగరిలో SiliconAndhra ఆధ్వర్యంలో జరిగిన శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి అవధానములో నేనిచ్చిన సమస్య:
Thursday, July 14, 2022
శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి అష్టావధానము - July 9th
Monday, April 5, 2021
Friday, April 2, 2021
Thursday, December 24, 2020
కాలిఫోర్నియా బే ఏరియాలోని "వీక్షణం" సంస్థ ఆధ్వర్యంలో డిసెంబరు 12, 2020న జరిగిన 100 వ సాహితీ (అంతర్జాల) సమావేశంలో అవధాని శ్రీ పాలడుగు శ్రీచరణ్ గారి అష్టావధానంలో ఒక పృచ్ఛకునిగా పాల్గొనే అదృష్టం కలిగింది.
నేనిచ్చిన సమస్య:
"గెల్వగ నేడ్చె నొక్కడును గెల్వక నోడినవాడు నవ్వగన్"
అవధాని గారి పూరణ:
కల్వల మిత్రునిన్ దలను కమ్రముగా ధరియించు వానికిన్
చెల్వము వామమందునను నిల్వగ కాముడు భీతిజెందె హా
గెల్వగ నేడ్చె నొక్కడును గెల్వక నోడినవాడు నవ్వగన్
పల్వలమందు చందురుడు బాడబరాట్టుగ పొంగినట్లుగన్
నా పూరణ:
నిల్వడి యెన్నికందు తను నెగ్గుటయే యొకధ్యేయమవ్వగన్
పల్వురఁ జేర్చి ఆర్భటిన బాగుగ ద్రవ్యము ధారబోయుచున్
కొల్వును బొందనేమి మరి కూర్చిన సంపద పోయెనంచు తాఁ
గెల్వగ నేడ్చె నొక్కడును గెల్వక నోడినవాడు నవ్వగన్!
ఈ అవధానమును https://youtu.be/IbyyBv9WLw4 లంకెలో 5:30:15 దగ్గరనుండి చూడవచ్చు.
Wednesday, December 31, 2008
ఉత్పలమాలలో శుభాకాంక్షలు
ఉ//
నూతన వత్సరంబు ఇక నూతన శోభను తెచ్చు మీకు, ఆ
సీతయు రాముడున్ గలసి శీఘ్రమె దీవెనలెన్నొ ఇవ్వ, మీ
పాతవి కష్టముల్ తొలగి, పట్టిన కార్యములెల్ల తీరి, మీ
చేతుల నిండుగా ధనము చేరగ చింతలు తీరు గ్రక్కునన్
Sunday, October 26, 2008
'తాటి' పద్యాలు
ఏప్రిల్లో బడి అయిపోయినతరువాత కాలవగట్టమ్మట సైకిలు తొక్కుకుంటూ ఇంటికి వెళుతుంటే అప్పుడప్పుడూ తాటిముంజలమ్మేవాడు దేవుడిలా ఎదురొచ్చేవాడు.
ఉ//
వేసవి కాలమందలసి వేడిభరించుట చాల కష్టమై
మూసిన కళ్ళతో యతని మోము తలంచుచు మ్రొక్కి వేడగా
దాసుడి రక్షకై యతడు తారసమాయెను భూమిపై వడిన్
వాసివి తాటిముంజలను పైకము కమ్మెడివాని రూపునన్
(సైకిలు త్రొక్కుతున్నప్పుడు కూడా ప్రాసకోసం కళ్ళు మూసుకోవలసి వచ్చింది :-)
పల్లెటూళ్ళలో పెరిగిన పిల్లలందరికీ వేసవిలో తాటికాయలతో తోపుడు బళ్ళు చేసుకుని ఆడుకోవడం ఆనవాయితి.
ఉ//
తిన్నని తాటిమట్టగని తెప్పున కన్నము చేసి అందు నో
సన్నని కర్రపుల్లొదవి చక్కని గుండ్రని తాటికాయలన్
ఎన్నిక చేసి వాటముగ నీదరి నాదరి గ్రుచ్చి నంత నో
మిన్నగు తోపుబండగును మేలుగ పిల్లలు ఆటలాడగా
కం//
లెక్కకు మూడవి ఉన్నను
ముక్కంటికి కన్ను ఒకటి మూసుకునుండున్
నిక్కముగా ముక్కంటది
చక్కనిదొక తాటికాయ సరసుడ వినుమా!
Thursday, October 23, 2008
ఉత్పలమాల
ఉ//
బ్లాగుని వ్రాయగా తలచి బ్లాగుట నేర్వగ పట్టుపట్టి నే
గూగులు బాగుగా వెదకి కొద్దిగ మార్గము కానరాగ వే
వేగమె బ్లాగునుందెరచి వేసితినొక్క టపాను ఇంక నా
వాగుడు పద్యరూపమున వ్రాయగ యత్నము చేసెదన్ సుమీ!
(మొదట వ్రాసినది)
ఉ//
బ్లాగుని వ్రాయగా తలచి బ్లాగుట నేర్వగ కూరుచుండి నే
గూగులు బాగుగా వెతకి కొంచము జ్ఞానము పొందినంత వే
వేగమె బ్లాగునుందెరచి వేసితి నొక్క టపాను, ఇంకనా
వాగుడు పద్యరూపమున వ్రాయుటకున్ ప్రయత్నించెదన్, భళీ!