Saturday, March 20, 2021

 'మతమును వీడిన మనుజుడె మాన్యు౦డిలలో!'

కం//

మితిమీరి సురను త్రాగుట,
అతిగా తా చీట్లపేక ఆడుట, రెండున్,
సతతము గొను దుర్జన స
మ్మతమును - వీడిన మనుజుడె మాన్యుండిలలో
(11/30/2012)


Friday, March 19, 2021

 సమస్య: ఉండెకన్యాకుమారియె ఉత్తరమున

తే.గీ||

బుద్ధగయఁ జూడ శ్రీలంక బౌద్ధుఁడొకడు

భరత దేశముఁ జేరగ  బయలుదేరి

నౌకలో పయనింపఁ యా నావికునకు

ఉండెకన్యాకుమారియె ఉత్తరమున

(10/30/2012)


Friday, February 12, 2021

 కం.

భార్యల యెదుటన భర్తలు

ధైర్యముగా నోరుఁదెరవ దైవము తాఁ చా

తుర్యపు వరముగ నిలఁ సౌ

కర్యముగా గురక నొసగె గదరా శ్యామా!


(భార్యలముందు నోరు తెరవలేని భర్తలను దయదలచి పరంధాముడు గురకను వరముగా ప్రసాదించెను)


Thursday, December 24, 2020

కాలిఫోర్నియా బే ఏరియాలోని "వీక్షణం" సంస్థ ఆధ్వర్యంలో డిసెంబరు 12, 2020న జరిగిన 100 వ సాహితీ (అంతర్జాల) సమావేశంలో అవధాని శ్రీ పాలడుగు శ్రీచరణ్ గారి అష్టావధానంలో ఒక పృచ్ఛకునిగా పాల్గొనే అదృష్టం కలిగింది.


నేనిచ్చిన సమస్య: 

"గెల్వగ నేడ్చె నొక్కడును గెల్వక నోడినవాడు నవ్వగన్"


అవధాని గారి పూరణ:

కల్వల మిత్రునిన్ దలను కమ్రముగా ధరియించు వానికిన్

చెల్వము వామమందునను నిల్వగ కాముడు భీతిజెందె హా

గెల్వగ నేడ్చె నొక్కడును గెల్వక నోడినవాడు నవ్వగన్

పల్వలమందు చందురుడు బాడబరాట్టుగ పొంగినట్లుగన్


నా పూరణ:

నిల్వడి యెన్నికందు తను నెగ్గుటయే యొకధ్యేయమవ్వగన్

పల్వురఁ జేర్చి ఆర్భటిన బాగుగ ద్రవ్యము ధారబోయుచున్

కొల్వును బొందనేమి మరి కూర్చిన సంపద పోయెనంచు తాఁ

గెల్వగ నేడ్చె నొక్కడును గెల్వక నోడినవాడు నవ్వగన్!


ఈ అవధానమును https://youtu.be/IbyyBv9WLw4 లంకెలో 5:30:15 దగ్గరనుండి చూడవచ్చు.


Saturday, June 13, 2020

"ఆకులు రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది". ఇవన్నీ కంటితుడుపు కబుర్లని బట్టతల నిరూపిస్తుంది.
 

కం//
ఆకులు రాలిన చోటునె
షోకుగ చిగురొచ్చు ననెడి సూక్తులు వినకోయ్
ప్రాకటముగ బట్టతలన
చేకూరునె వత్తు జుట్టు శ్రీకర శ్యామా!

Thursday, August 31, 2017

కం।।
డబ్బది వచ్చును బోవును
ఇబ్బందులు వచ్చిబోవు నిలలో మరి దా
నబ్బది పొట్టది మాత్రము
ఉబ్బుచుఁ దానొచ్చుఁ గాని ఊడదు శ్యామా!

(WhatsAppలో చూసాను: కష్టాలు వస్తాయి పోతాయి, ఆస్తులు వస్తాయి పోతాయి, కానీ పొట్ట మాత్రం వస్తే పోదు  )

Saturday, May 14, 2016

గోంగూరావతరణము

గోంగూరావతరణము
(3/30/2014)


( క్రింది పద్యాలలోని కొన్ని భావనలకు ప్రేరణ ఇంతకు పూర్వము కవి మిత్రులతో, ముఖ్యంగా లంక గిరిధర్ మరియు సనత్ శ్రీపతి లతో, జరిగిన ఒక సాహితీ చర్చ. అందులకు వారికి నేను పత్రికాముఖముగా నా కృతజ్ఞతలు తెలియ జేసుకుంటున్నాను)
 
కం//
ఉత్తమమౌ పచ్చడిగా
కుత్తుకకున్ సుఖముఁగూర్చు గోంగూర, భళా!
చిత్తమలరంగ యిదిఁ దిని
మత్తుగనిదరోవు సుఖము మహిలో గలదే!

సీ//
శాక పాకములందు శాకాంబరీ దేవి
                                దీవెనల్ పొందిన తెలుగు కూర
పంచశరుని యొక్క పంచాస్త్రములఁ బోలు
                                పంచాగ్రములుగల పచ్చ కూర
'దేవాంతకుడు' యందు, ధీటుగా N.T.R
                                గొప్పగా పొగిడిన గోగు కూర
ఆకుకూరలెపుడు  ఆరోగ్యమున్ బెంచు
                                యనుచు వైద్యుడొసగు  ఆకుకూర
.వె//
పప్పు కూరయందు పచ్చళ్ళయందున
పులుపు నొసగు నిదియె పుంటి కూర
ఆంధ్రులనగ మనము అదృష్టవంతులం
బనుచు చాటి చెప్పు ఆకు కూర.

.వె//
గోగు కూరదెచ్చి బాగుగా మగ్గించి
గరిట పోపు వేసి కమ్మగాను
రోట రుబ్బి దాని నీటుల్లిపాయతో
తినిన అమృతమునది తినిన యట్లె!

కం//
గరుడుడు కష్టములొందుట,
హరిపడతిగ వేషమేసి ఆడుట, కాకో
దరములు దర్భలు నాకుట,
తిరముగ గోంగూర రుచిని తెలియక సుమ్మీ!!

.
మత్స్యావతారనంతరము మునులందరు క్రొత్త ప్రదేశములో సరియైన తిండి కుదరక, ముఖ్యంగా నంజుడు లేక, విష్ణువునిలా ప్రార్ధించారు:

కం//
చప్పటి దుంపలు తినుచును
తిప్పలు పడుచుంటిమయ్య దేవా దయతో
గొప్పగు మార్గం బొక్కటి
చెప్పుము మా నాల్క లొక్క చింతలు తీర్పన్

అప్పుడు విష్ణువు, "సృష్ట్యారంభములో ఆవకాయ ఇచ్చానుగదా" అనెను. అప్పుడు మునులు స్వామికి మ్రొక్కి:

.వె//
"ఆవకాయఁ బెట్ట నైదు రోజులుఁ బట్టు
వేసవందుఁ దప్ప వీలుఁ గాదు
ఎల్లవేళలందు నింపుగా దొరికెడి
పచ్చడొసగు మయ్య పరమ పురుష!"

అన్నారు. అప్పుడు విష్ణువు గోంగూర విత్తనాలు సృష్టించి, మునులకిచ్చిఇట్లనెను:

కం//
ఎక్కడ పడితే అక్కడ
మిక్కుటముగ దొరకు మీకు, మేలును గూర్చున్
చక్కనిదౌ శాకము మీ
ఇక్కట్టులు తీర్చునట్టిదీ గోంగూరే!
  
కం//
గోంగూర వంటి బచ్చడి
గంగానది వంటి జలముఁ గలిగిన యేఱున్
చెంగావి వంటి రంగుయు
మంగాపతి వంటిదైవమవనిన గలవే!!

కం//
శతకముఁ జదవని వాడును
కుతుకముతో గోగు కూర కుడవని వాడున్
గతితప్పక సినిమాలను

అతిగా తాఁ జూడకున్న ఆంధ్రుడు కాడోయ్!