Tuesday, July 5, 2011

అష్టావధానము - డా.మేడసాని మోహన్ - మొదటి భాగము

తానా (TANA - Telugu Association of North America) వారి 18వ ద్వైవార్షిక తెలుగు సమావేశాలలో జూలై 3, 2011 వ తారీకున సాంతాక్లారా నగరంలో డా.మేడసాని మోహన్ గారి అష్టావధానము జరిగింది. అందులో ఒక పృచ్ఛకుడిగా పాల్గొనే అదృష్టము నాకు కలిగింది. దాని వివరాలు క్రింద ఇస్తున్నాను:
అధ్యక్షులు: డా. అక్కి రెడ్డి (మోహన్ గారి గురువులు)
పృచ్ఛకులు:
  • నిషిద్ధాక్షరి: తల్లాప్రగడ రామచంద్ర రావు
  • న్యస్తాక్షరి: నచకి (నల్లాన్‌చక్రవర్తుల కిరణ్)
  • దత్తపది: పుల్లెల శ్యామసుందర రావు
  • సమస్య: ఉపద్రష్ట సత్యం
  • కావ్య పఠణము: అక్కిరాజు సుందర రామకృష్ణ
  • ఆశువు: తిరుమలపెద్దింటి నరసింహాచార్యులు
  • వర్ణన: కాజా రామకృష్ణ
  • అప్రస్తుత ప్రసంగము: గొర్తి బ్రహ్మానందం.
నిషిద్ధాక్షరి: మడి అచారముయొక్క వైజ్ఞానికతను/గొప్పతనాని వివరిస్తూ కందం.

        శ్రీమాన్య శుభ్ర భావము
        ధీమయ సర్వప్రసన్న ధిగ్ద పరవిధిన్
        స్థేమానంత మనోగుణ
        ధామం బాచార ఘటన ధన్యత గూర్చున్


న్యస్తాక్షరి: భారత్ దేశంలో పెరుగుతున్న అవనీతి గురించి శార్ధూలము
  • 1వ పాదం: 6వ అక్షరం - నీ
  • 2వ పాదం: 13వ అక్షరం - ధీ
  • 3వ పాదం: 15వ అక్షరం - స్త
  • 4వ పాదం: 8వ అక్షరం - భా
        నాదేశంబవినీతి మార్గమున విన్యస్తంబుగా నొప్పుచో
        ధీధుర్యుల్ వికలస్వభావముల సంధిగ్దాత్ములై కుందగా
        వేదాద్యుత్వల సంప్రదాయ గతులన్ విద్వస్తముంజేయ,తత్
        గాధల్ సంస్మరియించి భాసుర పదాకాంక్షన్ నుతింతున్ హరిన్


దత్తపది: రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ పదముల నుపయోగించుచూ, సుఖసంసారమునకు మార్గములు సూచించుచూ, ఒక స్వేచ్ఛా వృత్తం చెప్పవలెను.

        రాజస్పూర్తి వహించు సుప్రణయ సంభ్రంభంబులింపారగా
        తేజంబొప్పు పురూర యూర్వశివిభా దీప్తిం ప్రసన్నాత్ములై
       పూజల్ గైకొనినట్టి మేనకళలన్ పొందింప దాంపత్య హే
       లా జాగ్రత్పధ భాతిలోత్తమగతుల్ లాస్యంబులై మించగన్


సమస్య: స్తనములులేని పూరుషుడు సంస్థవనీయుడుకాడు ధాత్రిలో

        అనుపమమైన సంపదల అద్భుతహేల వహించి యుండియున్
        ఘనతర వీరవిక్రమ విఘట్టిత క్షాత్రవులై ఎసంగియున్
        నినదిత దివ్య భావుక ఘణీకృత సార ధురీణ భారతీ
        స్తనములులేని పూరుషుడు సంస్థవనీయుడుకాడు ధాత్రిలో

సరస్వతి యొక్క రెండు స్తనములను సంగీత సాహిత్యములుగా భావించి, "..భారతీ స్తనములు లేని పూరుషుడు.." గా పూరించడము జరిగినది.


మిగిలిన వివరాలు (వర్ణన, ఆశువు, నిషిద్దాక్షరిలో నిషేదింపబడిన అక్షరాలు మొ||), తరువాయి భాగములో...

భవదీయుడు,
పుష్యం

Monday, March 22, 2010

చమత్కార వికృతులు

అమెరికాలోని కాలిఫోర్నియా బే-ప్రాంతంలో సిలికానాంధ్రా వారు నిన్న వికృతినామ యుగాది సంబరం జరిపారు (ఇక్కడ అన్ని పండుగలు modulo weekendన జరుగుతాయి :-) . అందులో జరగిన కవిసమ్మేళనంలో నేను చదివిన పద్యాలివి. చమత్కారం కోసమని మనము చిన్నప్పుడు చదువుకున్న కొన్ని పద్యాలకు వ్రాసిన పేరడీలు. ఈ పేరడీలకు కారణమనదగ్గది పొద్దు పత్రికవారి ఉగాది కవిసమ్మేళనంలో ఇచ్చిన 'లావొక్కింతయు లేదు' తో ప్రారంభించి పద్యం వ్రాయమని ఇచ్చిన సమస్య.


'టీ కొట్టు నాయరు':

కం//
ఇందుగల డందు లేడని
సందేహము వలదు మీకు, చక్కగ నాయర్
ఎందెందు వెదకి చూచిన
అందే టీ కొట్టు పెట్టు, అద్భుత రీతిన్!!

-----------

ఈ రోజుల్లో ఎవరు డాబుగా మాట్లాడతాడో వాడే పైకి వస్తునాడు.

ఆ.వె//
అల్పుడెపుడు పల్కు ఆడంబరముగాను
అందువలనె వాడు అధికుడౌను
అరచునట్టి శునక మావులు కాయదా?
విశ్వదాభిరామ వినర శ్యామ!!


-------------

శతకకారుడు చక్కని పద్యమొకటుంటే చాలన్నాడు. దానినే ‘అల్లుడి గొంతెమ్మ కోర్కెలు’ కి అన్వయించుకుంటే:

ఆ.వె//
"నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు.
పట్టుపంచెలారు, వాచి ఒకటి.
తిండి తినగ నాకు వెండి కంచము చాలు.
చక్కనైన కారు చాలునాకు"

---------------

కం//
సిరిగల వానికి చెల్లును
తరుణులు పదియారు వేలు తగ పెండ్లాడన్
చిరు మానవునకు కుదరదు
'ఒరు’ పెండ్లామే సరిపడు ఓరిమి పోవన్!

-----------------------

గజేంద్ర మోక్షంలో పోతన 'లావొక్కింతయు లేదు' అని ఒక శార్ధూలము వ్రాశాడు. దానిని కొద్దిగా మారిస్తే:

ఒక తల్లి తనకు నచ్చిన అమ్మాయిని చూడమని కొడుకునుద్దేసించి:

కం//
“లావొక్కింతయు లేదుర,
జీవితమున నీకుమంచి చేదోడగురా.
పావని చక్కని పిల్లర,
నీవామెను చూడకున్న నేనొప్పనురా!!”

--------------------

ఇంట్లో సంగీతం నేర్చుకునే పిల్లలున్న వాళ్ళందరికీ తెలిసిన విషయం:

ఆ.వె//
అనగననగ రాగ మతిశయిల్లుచునుండు,
వినగవినగ చెవులు బిళ్ళ కట్టు.
పాట రాని పిల్ల పగలు రాత్రెరుగదోయ్,
విశ్వదాభిరామ వినర శ్యామ!!

౨౯-మార్చ్-౨౦౧౦
మా భా.భా.సం. సభ్యులు, పిల్ల బాధకంటే ఇల్లాలి పాట బాధ ఎక్కువుందంటే, వారికోసం మూడో పాదం మార్చాను :-)

.వె//
అనగననగ రాగ మతిశయిల్లుచునుండు,
వినగవినగ చెవులు బిళ్ళ కట్టు.
పాటరాని భార్య బాధ బ్రహ్మెరుగునా?
విశ్వదాభిరామ వినర శ్యామ!!

(అనుకోకుండా వ్రాసినా, ఇక్కడ చిన్న చమత్కారం దొర్లింది: బ్రహ్మ భార్య 'సంగీత' సరస్వతి కదా!!)
---------------------------


అమెరికాలో ఉండడం మూలంగా బంధువులు వచ్చే ప్రమాదం లేదుగాని, ఒక్క డాలరు సంపాదించినా Tax వాడు మటుకు తప్పక వస్తాడు. రాబోవు April 15th మాకు Tax Day. దానిని దృష్టిలో పెట్టుకుని:

కం//
ఎప్పుడు సంపద కలగిన
అప్పుడె ఆదాయపన్ను ఆడిటరొచ్చున్.
కుప్పలుగ చెప్పులున్నచొ
తప్పక శునకంబు వచ్చు, తథ్యము శ్యామా!!

పద్యాలు మీకు నచ్చుతాయని ఆశిస్తూ,
పుష్యం

Wednesday, July 22, 2009

పాత మిత్రులు -- పద్యాలు

పొద్దు పత్రికవారు విరోధినామ సంవత్సర ఉగాది సంధర్భంగా జరిపిన అంతర్జాల కవిసమ్మేళనంలో వర్ణన అంశం క్రింద ఇద్దరు పాత మిత్రులు చాలాకాలం తరువాత కలిస్తే ఎలాఉంటుందో వర్ణించమన్నారు. దానికి నేను చేసిన ప్రయత్నం.

చాలా కాలం తరవాత పాత మిత్రుడ్ని కలుసుకున్న ఒక సాయంకాలం.

తలుపుతీసి ఆనందంగా,

కం//
"ఎన్నాళ్ళయ్యెను చూడక;
ఇన్నాళ్ళకు కలసినావు, ఏమయ్యావోయ్?
చిన్నప్పుడు కలవడమే,
ఎన్నోమారులు తలచితి, ఈవిడ నడుగోయ్!!"

అంటూ పరామర్శలయిన తరువాత,

కం//
వేళాకోళము లాడుతు,
ఖాళీ బుర్రను తడుముతు, కబురులు చెబుతూ,
భోళా నవ్వులు నవ్వుతు,
గోళీలాడిన దినములె గొప్పవి అనుచున్.

కం//
బొండాం శ్రీనుని తలచిరి,
గుండే ఎల్లప్పుడుండు గుర్నాధాన్నీ,
కండలు తిరిగిన బాలిక
ఆండాళును కూడ తలచి రానందంగా.

కం//
ఆడిన సినిమా లన్నియు
చూడ చదువొదలి సెకెండు షోలకు వెళుతూ
తోడగు దొంగల మాదిరి
గోడలు దూకిన దినములు గుర్తుకు తెస్తూ

కం//
“ఫైటంటే కాంతారావ్,
పాటంటే ఘంటసాల, బాగా ఫేమస్
షాటంటే ఎన్.టీ.ఆర్,
ఆటంటే జ్యోతిలక్ష్మి, ఆరోజుల్లో”

అంటూ పాత రోజులను తలచు కున్నారు.

కం//
ఇల్లాలిచ్చిన ప్లేటున
పల్లీలను నోటవేసి పటపట తినుచున్,
మెల్లగ సాయంత్రంబున
సిల్లీగా జోకులేస్తు, చీకటిదాకా…

మిత్రుడితో గడపి, ఆపై

కం//
"మళ్ళీ కలవాలయ్యా.
ఊళ్ళోనే ఉండి కూడ ఊసుల కోసం,
వాళ్ళూవీళ్ళెందుకు. మన
పెళ్ళాలిరువురును మంచి ఫ్రెండ్సయ్యారోయ్"

అంటూ సాగనంపాడు..


(పైన ఉన్న "ఫైటంటే" పద్యం సర్వ-గురు కందం. కందం నియమాల ప్రకారం 6, 14 గణాలలో తప్ప మిగిలినవన్నీ గురువులే. దీనిని కుఱచ కందం అని కూడా అంటారు)

Monday, June 1, 2009

కవిత్వం ఎలా ఉండకూడదు..

చాలా మంది కవులు కవిత్వం ఎలాఉండాలి అని నిర్వచించారు గాని, ఎలా ఉండకూడదో చెప్పలేదు. కవిత్వం ఎలాఉండాలని పెద్దన చెప్పిన పద్యం అందరకూ తెలిసిందే. పెద్దన పద్యం చెప్పగానే చమత్కారంగా రామభధ్ర కవి ఈ క్రింది పద్యం చెప్పాడట. ఇంచుమించుగా ఒక ఏడాది క్రితం మా ఊళ్ళో జరిగిన 'అమెరికా సాహితీ సదస్సు'లో రేవూరి పద్మనాభరావుగారు కవిత్వంలో చమత్కారం గురించి ప్రసంగిస్తూ ఈ విషయం చెప్పారు. తరువాత ఆయన చెప్పగా నేను వ్రాసుకున్న కాగితం తప్పిపోయి నిన్ననే దొరికింది. అయితే అందులో కొన్ని అక్షరాలు చెరిగిపోయి సరిగా కనిపించడం లేదు. ముఖ్యంగా అయిదవపాదంలో కొన్ని అక్షరాలు తెలియడంలేదు. ఈ పద్యం తెలిసిన వాళ్ళు చెప్పగలరు.



నెరిచెడుపాడు భావములు, నిద్దురపోయెడు కుంభకర్ణుగు
ర్గురురురురావముల్, మనసు కోరినవాడు నిరాకరింప సుం
దరి మరి వెక్కివెక్కి విలపింపగ వచ్చెడి పిచ్చికూతలం
దిరుకు కెకెక్కెకె ధ్వనులు, ఇత్తడి చెంబున రాళ్ళు పోసి గి
ర్గిరగిర ద్రిప్పనుప్ప ????, గాడిదమూకలు కొల్వుదీర్చి సుం
దరముగ గొంతు విప్పి సరదాపడి రాగము లాలపించు, బం
డరములు రుబ్బు పొత్తరము నానిన గారెల పొట్టు ఇట్టు న
ట్టొరసి నిరంతరంబు గరరో గరరోయని చేయు శబ్దముల్,
తిరముగ నిల్ప కావ్య సరళిన్ రచియింపగరాదు సత్కవుల్

Sunday, March 29, 2009

ఆవకాయ - పద్యాలు

కాలిఫోర్నియాలోని సిలికాన్‌వేలీలో మార్చి 28న సిలికానాంధ్రా వారి శ్రీ విరోధీనామ సంవత్సర ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. దానిలో భాగంగా జరిగిన కవి సమ్మేళనములో నేను చదివిన పద్యాలు.


కం//
శ్రేష్టంబిది పచ్చళ్ళన,
టేష్టున ఇది మొదటనుండు డెఫినెట్ గానూ,
ఇష్టముగ ఆవకాయను
సుష్టుగ తిని దొర్లినంత సుఖమది కలదే!


(ఈ పై పద్యం లోని ఆఖరి రెండు పాదాలూ, కవి మిత్రులు 'ఆత్రేయ' గారి అనుమతితో వారి ఒక పద్యమునుంచి 'లేపిన'వి.)


కం//
ఊరిన ముక్కను కొరకగ,
ఔరా! అది ఎంత రుచిని అందించునయా,
కూరిమితొ నాల్గు ముక్కలు
నోరారా తినని నోరు నోరవ్వదుపో!

కం//
బెల్లము వేసిన మధురము,
పల్లీనూనెను కలపగ పచ్చడి మధురం,
వెల్లుల్లి వేయ మధురము,
పుల్లని మామిడితొ చేయ ముక్కది మధురం!!


ఈ ఆవకాయలోని ముక్కకి చాలా పేర్లు ఉన్నాయి:

కం//
చెక్కందురు, డిప్పందురు,
ముక్కందురు కొంతమంది మురిపెము తోడన్.
డొక్కందురు, మామిడి దిది
పిక్కందురు దీనికన్ని పేర్లున్నవయా!


ఆవకాయ ఉపయోగాలు:

కం//
ఉదయమె బ్రెడ్డున జాముకు
బదులుగ ఇదివాడిచూడు, బ్రహ్మాండములే,
అదియేమి మహిమొ తెలియదు,
పదునుగ నీ బుర్ర అపుడు పనిచేయునయా!


కం//
ఇందువల దందు బాగని
సందేహము వలదు; ఊట సర్వ రుచిహరం
బెందెందు కలపి చూసిన,
అందందే రుచిగనుండు, అద్భుత రీతిన్!


ఆవకాయ అవతరణ:

కం//
“చప్పటి దుంపలు తినుచును,
తిప్పలు పడుచుంటిమయ్య, దేవా, దయతో
గొప్పగు మార్గం బొక్కటి
చెప్పుము మా నాల్కలొక్క చింతలు తీర్పన్”

అంటూ,

కం//
ముక్కోటి దేవులందరు
మ్రొక్కగ తా జిహ్వలేప సృష్టించెనయా
చక్కనిది ఆవకాయన
ముక్క తినని వాడు కొండముచ్చై పుట్టున్!!


కం//
చారెరుగనివాడును, గో
దారిన తా నొక్కమారు తడవని వాడున్,
కూరిమిన ఆవకాయను
ఆరారగ తిననివాడు, ఆంధ్రుడు కాడోయ్!

Wednesday, March 11, 2009

శ్రీనాధుడి చాటువు

పని ఒత్తిడి వలన ఈ మధ్య తెలుగు బ్లాగ్లోకంలో గడపడానికి సమయం చిక్కలేదు.


కం//

ఇక్కడి జీవిత మింతే,

లెక్కకు సౌకర్యమున్న లేదులె సమయం;

ఎక్కడ, తీరిక దొరకదు.

చక్కగ ఈ బ్లాగులన్ని చదువుట కొఱకై


చాలా రోజుల తరువాత బ్లాగులు తిరగేస్తూ ఉంటే శ్రీనాధుడి చాటువొకటి కనపడింది.

వెంటనే శ్రీనాధుడి ఇంకొక చాటువు గుర్తుకొచ్చింది.

నా తప్పేంలేదంటూ, అలాంటి సమర్ధింపే ఈ చాటువులో కూడా చూడండి:


గుబ్బలగుమ్మ, లేచిగురు కొమ్మ, సువర్ణపు కీలుబొమ్మ, భల్

గిబ్బిమిఠారి చూపులది, కాపుది, దానికి ఏల ఒక్కనిన్

బెబ్బులి నంటగట్టితివి, పెద్దవునిన్ననరాదు గాని, దా

నబ్బ, పయోజగర్భ, మొగనాలికి ఇంత విలాసమేటికిన్!!


తాత్పర్యం:
ఓ బ్రహ్మా (దానబ్బ, పయోజ గర్భ), ఇంతటి అందగత్తెకు (గుబ్బల గుమ్మ, లేచిగురు కొమ్మ, సువర్ణపు కీలుబొమ్మ) ఒక బెబ్బులి లాంటి వాడినెందుకు అంటగట్టావయ్యా?? అంతే కాకుండా, ఇలాంటి వివాహితకు (మొగనాలికి) ఇంత విలాసమెందుకిచ్చావయ్యా? (కవిహృదయం ఏమిటంటే, ఆమెను వలచడంలో నా తప్పేమీ లేదు, సృష్టించిన నీదే తప్పు అని )




Saturday, February 7, 2009

అంతర్జాలంలో పద్యాలు - జనవరి 2009 సమీక్ష

ఆకాశవాణి, అంతర్జాల కేంద్రం. అంతర్జాలంలో ఈ మాసం (జనవరి 2009) నమోదైన పద్యాలవానల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సాధారణంగా పద్యాల వానకురిసే 'ఆంధ్రామృతం', 'తెలుగు పద్యం' వగైరా బ్లాగులలోనే కాకుండా, కొన్ని అనుకోని బ్లాగులలో కూడా 'వ్యాఖ్య'లలో ఒక మోస్తరునుండి భారీఎత్తున పద్యాల వాన కురవటం జరిగింది.


నెలారంభంలో వాన ప్రారంభించడానికి భైరవభట్ల గారు ప్రయత్నిచారు గాని, ఎందుకనో పెద్దగా వాన కురవలేదు.


వాన రాకకు సూచనగా కామోసు ఫణిగారు బ్లాగులో గట్టిగా ఉరిమారు.


ఈ నెల శ్రీ రాఘవ గారి బ్లాగులో ఉధృతంగా పద్య వర్షాలు కురిసాయి. ఆ వానలు 'శ్రీ శ్రీ లేకున్ననేమి సిరిసిరి మువ్వా' తో ప్రారంభమై, మధ్యలో 'శ్రీ శ్రీ నిక తలచునెవడు సిరిసిరిమువ్వా' అనుకుని చివరకు 'సవ్వాలే లేదు.. ఇటువంటి సరసపు కవనం.. వెవ్వెడల వెదక కనగలమే' అని నిర్ధారించుకున్న తరువాత ఆగాయి.


ఆచార్య ఫణీంద్రగారి బ్లాగులో వీధిదీపం దగ్గర నిలబడి పానీపూరి తింటూంటే చక్కని పద్యవాన కురిసింది.


మీసంలో తెల్లవెంట్రుక గురించి కొత్తపాళీ గారు బాధపడుతుంటే, అనుకోని విధంగా అక్కడ వ్యాఖ్యలలో కొద్ది వానలతో ప్రారంభమైన అల్పపీడనం తూర్పుదిశగా(*) పయనించి భైరవభట్ల గారి బ్లాగులో కేశంతో క్లేశం గా తీరాన్ని దాటింది.


పద్యాలు వ్రాయడం నేర్చుకుంటున్నాను అంటూనే ఆత్రేయగారు తన కంద కదంబం బ్లాగులో నవరసాల్లో భారియెత్తున పద్యవానలు కురిపించడం ప్రారంభించారు.


ఆంధ్రామృతం బ్లాగులో 'మేలిమి బంగారం మన సంస్కృతి', 'సమాధానం కనుక్కొండి చూద్దాం' వగైరా శీర్షికలతో చిరపుంజిని మించిపోతూ, ఇంచుమించుగా ప్రతిరోజూ పద్య వర్షం కురిసింది.


ఇక కొసమెరుపుగా నెలాఖరి రోజున, వాగ్విలాసము బ్లాగులో రాఘవగారు, చిత్రంగా పద్యవర్షం కురిపించారు.


ప్రస్తుత అంచనాల ప్రకారం వచ్చే నెలలో కూడా ఇలాగే పద్యవానలు కొనసాగే అవకాశాలు చాలా కనపడుతున్నాయి.



(టపాలలో వచ్చిన పద్యాలు కూడలి, జల్లెడ మొదలైన వాటిలో కనపడినా, వ్యాఖ్యలలో వచ్చినవి ఆ బ్లాగుని అనుసరించితే తప్ప తెలియవు కాబట్టి, పద్యాలంటే ఆసక్తి ఉన్నవారి సౌలభ్యం కోసం ఇలా నెలకొకసారి అంతర్జాలంలో పద్యాలను సమీక్షించాలని నా ప్రయత్నం. ఇవి నేను చదివిన బ్లాగులలో వచ్చినవి మాత్రమే. నేను ఇంకా ఏవైనా పద్యాలు అచ్చయిన బ్లాగులను మరచినచో తెలియచేయగలరు)